సోమవారం నుంచి రాష్ట్రంలో బడిగంటలు మోగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలలు తెరుస్తున్నామని చెప్పారు. విద్యా సంవత్సరం కవర్ చేసుకునేలా సిలబస్ రూపొందించామని తెలిపారు. మంత్రి సురేశ్ శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 2 నుంచి 9, 10, ఇంటర్ రెండో ఏడాది విద్యార్థులకు తరగతులు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. నవంబరు 16 నుంచి ఇంటర్ తొలిఏడాది తరతులు నిర్వహిస్తామన్నారు. నవంబరు 23 నుంచి 6,7, 8 తరగతులు... డిసెంబరు 14 నుంచి 1-5 వరకు తరగతులు ప్రారంభిస్తామన్నారు. నవంబరు 23 నుంచి రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు తెరుస్తామని వివరించారు. ఇప్పటికే డిగ్రీ, పీజీ తరగతుల షెడ్యూల్ ఇచ్చామని చెప్పారు.
2020-21 విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తవుతుందని మంత్రి సురేశ్ వెల్లడించారు. పాఠశాలల పనిదినాలు 180 రోజులు ఉంటాయని తెలిపారు. ఇంటర్ ప్రవేశాల్లో గందరగోళంపై ఆయన స్పందించారు.