రాష్ట్రంలో 2020 - 21 సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ అంచనాలు 2.60 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉండే అవకాశం ఉంది. ఇది మరింత పెరిగినా ఆశ్చర్య పోనవసరం లేదు. జూన్ 16న శాసనసభలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మార్చి నెలలోనే బడ్జెట్‌కు ఆమోదం పొందాల్సి ఉండటంతో దాదాపు తుది రూపునిచ్చారు. చివరలో ఉన్నతస్థాయి అధికారులు మెరుగులు దిద్దాల్సిన సమయంలో కరోనా ప్రభావంతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది.
9 నెలల కాలానికి
తొలి మూడు నెలల కాలానికి బడ్జెట్ వినియోగం కోసం ఓటాన్ అకౌంట్ రూపంలో ఆర్డినెన్సు జారీ చేశారు. జూన్‌తో ఆ కాలపరిమితి పూర్తవడంతో జులై నుంచి తిరిగి అవసరమైన ఖర్చులకు శాసనసభ ఆమోదం పొందాల్సి ఉంది. అందుకే పూర్తి స్థాయి బడ్జెట్‌ను సభలో సమర్పిస్తారు. 9 నెలల కాలానికి అవసరమైన పద్దుకు ఉభయ సభల ఆమోదం పొందనున్నారు. ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్సుకు కూడా ఉభయసభల ఆమోదం పొందాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ 3 నెలల కాలానికి అవసరమైన ఖర్చులకు, ఇతర చెల్లింపులకు బడ్జెట్ విడుదల ఉత్తర్వులనిచ్చారు. కొంతమేర వెచ్చించారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు పరిశీలించి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పూర్తి స్థాయి బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు.