రాష్ట్రంలో రెండు మండల పరిషత్తు అధ్యక్షులు (ఎంపీపీ), అయిదు ఉపాధ్యక్షులు, రెండు కో-ఆప్షన్ సభ్యుల స్థానాలకు నిర్వహించిన ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఎంపీటీసీ సభ్యులు హాజరు కానందున అధికారులు వాయిదా వేశారని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. శనివారం ఆయా స్థానాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. హైకోర్టు స్టే ఇవ్వడంతో గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ, ఉపాధ్యక్ష, కో-ఆప్షన్ సభ్యుల స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించలేదు.
చిత్తూరు జిల్లా వాల్మీకిపురం, గుడిపల్లిలో ఎంపీపీ, ఉపాధ్యక్షులతోపాటు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక, కడప జిల్లా గాలివీడు, సిద్ధవటం, గుంటూరు జిల్లా నరసాపురం మండల పరిషత్తు ఉపాధ్యక్షుల ఎన్నికలు వాయిదా వేశారు. గత నెలలో 8 ఎంపీపీ, 20 ఉపాధ్యక్ష, 6 కో-ఆప్షన్ సభ్యుల స్థానాలకు ఎన్నికలు వాయిదా పడటంతో శుక్రవారం నిర్వహించారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు, నెల్లూరు జిల్లా వింజమూరు, చిట్టమూరు, చిత్తూరు జిల్లా నిండ్ర, విజయనగరం జిల్లా కొత్తవలస ఎంపీపీలతోపాటు మరికొన్ని జిల్లాలతో కలిపి 14 చోట్ల మండల ఉపాధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవమైంది.