ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు - హైదరాబాద్‌లో కరోనా మరణాలు

తెలంగాణలోని గ్రేట‌ర్ హైద‌రాబాద్ పరిధిలో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజుకు 150 నుంచి 200 మంది కొత్తగా జంటనగరాల్లో ‌వైర‌స్ బారినప‌డుతున్నారు. ప్రజా ప్రతినిధులు, వారి సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు పెద్దసంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. పాతబస్తీలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ నిర్ధర‌ణ అయిన‌ట్లు అధికారులు వెల్లడించారు.

corona cases increased in hyderabad
హైదరాబాద్ లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

By

Published : Jun 16, 2020, 1:20 PM IST

హైదరాబాద్​లో కరోనా విజృంభణ ఆగట్లేదు. వారం రోజులుగా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతిరోజూ 100కు పైగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోనూ వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తాజాగా ఈ జిల్లాలో 13, గ్రేటర్‌ పరిధిలో 189 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 133, శనివారం 179, ఆదివారం 195.. సోమవారం కూడా అదే స్థాయిలో మహమ్మారి విరుచుకుపడింది. వైద్యులపై పంజా విదిల్చింది.

వైద్యులనూ వదలట్లేదు

సోమవారం నమోదైన కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 18 మంది వైద్యులు ఉన్నారు. రెండు, మూడు నెలలుగా వైరస్‌ బాధితులకు సేవలు అందిస్తున్న ప్రాణదాతలను మహమ్మారి వదలడం లేదు. పేట్లబురుజు ఆసుపత్రిలో శుక్ర, శనివారాలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వైద్యులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 14 మంది వైద్యులు, 18 మంది పారిశుద్ధ్య, సహాయక సిబ్బందికి వైరస్‌ సోకినట్టు నిర్ధరణ అయింది. అమీర్‌పేట్‌ ప్రకృతి వైద్య చికిత్సాలయంలోనూ ఇద్దరు వైద్యులు వైరస్‌ బారిన పడ్డారు. ఇటీవల ఈ ఇద్దరు వైద్యులు ఓ వైరస్‌ బాధితుడికి దగ్గరగా ఉండి సేవలు అందించారు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు. అనంతరం ఇద్దరు వైద్యులకు చేసిన పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చింది. రెండ్రోజులుగా వీరిలో ఒకరికి జ్వరం, దగ్గు లక్షణాలు బయట పడటంతో అనుమానం వచ్చి మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఈ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు తెలుస్తోంది.

బాలింతకు కరోనా

ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లిన గర్బిణితో పాటు బిడ్డను కూడా వైద్యులు, సిబ్బంది కాపాడారు. ఆ తరువాత ఆ బాలింతకు కరోనా అని తేలటంతో ప్రసవం చేసిన వైద్యులు, సిబ్బందిని హోంక్వారంటైన్‌కు తరలించారు. కొద్దిరోజులుగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ శివారు ప్రాంతాలను కమ్మేస్తోంది. కొత్త కేసుల్లో అధిక శాతం నగరం చుట్టు పక్కల నమోదవటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఓ ముఖ్య అధికారి సహాయకుడికీ తాజాగా కొవిడ్‌ పాజిటివ్‌గా తేల్చారు. బాధితుడు రెండ్రోజులుగా ఆ అధికారి వద్దనే విధులు నిర్వర్తించినట్టు తెలుస్తోంది.

వృద్ధులు.. మహిళలపై పంజా

అంబర్‌పేట పరిధిలో కొత్తగా 14 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో వృద్ధులు నలుగురు, మహిళలు ఏడుగురున్నారు. వైరస్‌ సోకుతున్న వారిలో కొద్ది రోజులుగా మహిళలు, వృద్ధులు అధికంగా ఉంటున్నారు. మరోవైపు దుకాణాలు, ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలకు తిలోదకాలిస్తున్నాయి. వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో కనీస చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ హోమియో ఆసుపత్రికి జరిమానా విధించారు.

ఇదీ చదవండి:ఏప్రిల్​లో ఆస్కార్ అవార్డుల వేడుక

ABOUT THE AUTHOR

...view details