తెలంగాణ సంగారెడ్డి జిల్లా కొల్లూరు గ్రామ పరిధిలో బాహ్య వలయ రహదారి(ORR) నిర్మించారు. ఇందుకోసం సర్వే నెంబర్ 205లో 4.38ఎకరాలను హెచ్ఎండీఏ(HMDA) సేకరించింది. నలుగురు రైతులకు పరిహారం చెల్లించింది. వీరిలో ముగ్గురి తరఫున వీఎల్ఎస్.ప్రసాద్ అనే వ్యక్తి జీపీఏ హక్కుదారుడిగా పరిహారం తీసుకున్నారు. కానీ ప్రస్తుతం రికార్డుల్లో మాత్రం ఔటర్ రింగ్ రోడ్డు పేరు మీద ఈ సర్వే నెంబర్లో గుంట భూమి కూడా లేదు. ఓఆర్ఆర్ పేరు మీద ఉండాల్సిన భూమిని గతంలో ఇదే సర్వే నెంబర్లో ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్న వారి పేర్ల మీద నమోదు చేశారు. అలాగే సర్వే నంబర్ 209లో బాహ్య వలయ రహదారి కోసం 6.29ఎకరాల భూమి అవసరమైంది. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించిన అధికారులు భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. స్థలాన్ని సేకరించి రోడ్డు నిర్మించినా... భూయాజమాన్య హక్కుల్లో వివాదం కారణంగా పరిహారం చెల్లించలేదు. ప్రస్తుతం కొంత మంది తమకు రికార్డులో ఉన్న భూమి కంటే క్షేత్ర స్థాయిలో తక్కువ ఉందని, పక్కనే ఉన్న సర్వే సంఖ్య 191లోని ప్రభుత్వ భూమిని అక్రమించే ప్రయత్నం చేస్తున్నారు.
సర్వే సంఖ్య 210లో మొత్తం విస్తీర్ణం 10.23ఎకరాలు ఉండగా, బాహ్య వలయ రహదారి కోసం 10.04ఎకరాలు సేకరించారు. 4.37ఎకరాలకు మాత్రమే పరిహారం చెల్లించారు. బహిరంగ మార్కెట్ విలువ కంటే ప్రభుత్వం ఇచ్చే పరిహారం తక్కువగా వస్తోందన్న కారణంతో మిగిలిన 5.07 ఎకరాలకు పరిహారం తీసుకునేందుకు యజమానులు నిరాకరించారు. ఈ సర్వే సంఖ్యలో కేవలం 19గుంటల భూమి మాత్రమే మిగిలింది. కానీ క్షేత్ర స్థాయిలో భూమి ఎక్కువగా ఉందంటూ...... 2014లో అప్పటి తహశీల్దార్ 5.07ఎకరాలకు ప్రైవేటు వ్యక్తులకు పాసుపుస్తకాలు జారీ చేశారు.