గురుకుల పాఠశాలలో కరోనా(Corona Cases in gurukul school) కలకలం రేపుతోంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా గురుకుల బాలికల పాఠశాలలో 13 మంది విద్యార్థినులకు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఎనిమిదో తరగతికి చెందిన 13 మంది బాలికలకు వైరస్ సోకిందని వైద్య సిబ్బంది తెలిపారు. మిగిలిన విద్యార్థులకు కరోనా పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇటీవల ఓ పాఠశాలలోనూ..
ఇటీవలె నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని చెన్నారం గేట్ వద్ద ఉన్న గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులు, ఉపాధ్యాయులకు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కరోనా లక్షణాలున్న ఎనిమిది మంది విద్యార్థినులు, ఇద్దరు టీచర్లకు పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్లు తేలింది. వారిలో ఆరుగురు విద్యార్థినులు, ఇద్దరు టీచర్లను హోం క్వారంటైన్‌కు పంపారు. మరో ఇద్దరు విద్యార్థినులను పాఠశాలలోనే క్వారంటైన్లో ఉంచి చికిత్స అందించారు. అయితే స్కూల్‌కు వచ్చినప్పుడు అందరు ఆరోగ్యంగానే ఉన్నట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రుల వల్లే వైరస్ సోకి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు.
తల్లిదండ్రుల్లో భయం..
సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కావడంతో కాస్త భయంతోనే తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడంతో గురుకులాలు తెరిచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విద్యార్థులు పాఠశాలలోని వసతి గృహాలకు చేరుకున్నారు. అంతా సవ్యంగా ఉందని తల్లిదండ్రులు అనుకునేలోపే... పాఠశాలలోని 13మంది విద్యార్థులకు వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలోనూ పలు పాఠశాలల్లో కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని చాలా స్కూళ్లలోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఆ తర్వాత కాస్తు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. మళ్లీ విద్యార్థులపై కరోనా పంజా విసరడంతో మిగిలిన విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.