Food Poison: తెలంగాణలోని మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో.. మధ్యాహ్న భోజనం తిన్న కొంత మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకోవడంతో వారిని రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాఠశాలలో 244 విద్యార్థులు ఉండగా.. 11 మంది అస్వస్థతకు గురయ్యారు. నాణ్యత లేని గుడ్లు ఇవ్వడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.
తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతి ధర్మారం ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 301 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శుక్రవారం పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. మొత్తం 244 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్న భోజన సమయంలో అన్నం మెత్తగా ఉండటంతో పాటు కొంత మాడిపోయింది. మరోవైపు విద్యార్థులకు అందజేసిన గుడ్డు లోపలి భాగంలో ఎర్రగా మారడంతో పాటు కుళ్లిన వాసన వచ్చింది. తినే సమయంలో కొందరు విద్యార్థులు గుర్తించి ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లగా.. వాటిని పడవేయాలని సూచించారు. అయితే అప్పటికే పలువురు వాటిని తినేశారు. ఆపై ఆటలాడుకునే సమయంలో ఇద్దరు వాంతులు చేసుకోగా.. సాయంత్రం ఇంటికెళ్లిన తర్వాత మరికొందరు వాంతులు చేసుకున్నారు. ఇలా ప్రగతిధర్మారం, శివాయిపల్లి, నార్లాపూర్ గ్రామాలకు చెందిన ఐశ్వర్య, సమీరా, స్వప్న, అఖిల్, దీపిక, అక్షయ, భవానీ, జోహా, అఖిల్, చరణ్, గోపాల్ సహా 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.