Heroin Seized: డబ్బు సంపాదన కోసం ఎన్నో అక్రమ మార్గాలు. అందులో ఒకటి డ్రగ్స్ రవాణా. పోలీసులు, అధికారులు ఎంత నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి దేశాలు దాటిస్తూనే ఉన్నారు. బ్యాగులు, ప్యాకెట్లు ఇలా ఒకటేమిటి.. నానా మార్గాల్లో వాటిని సరఫరా చేస్తూనే ఉన్నారు. అధికారులకు పట్టుబడుతూనే ఉన్నారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు మత్తు అక్రమ రవాణాలో.. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో రూ. కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇలా అయితే దొరికిపోతాం అనుకున్నారేమో.. మరో పద్ధతిని అవలంభిస్తున్నారు. అదే క్యాప్సూల్స్ రూపంలో.
'వీడొక్కడే' సినిమాలో డ్రగ్స్ సరఫరా చేయడం కోసం విలన్.. కొందరితో క్యాప్సూల్స్ మింగించి.. అవి అరగకుండా కడుపులో భద్రపరిచి దేశం దాటిస్తాడు. వాటిని విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటాడు. అలాంటి సన్నివేశమే హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. గత నెల 26న జోహనెస్‌బర్గ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన టాంజానియా ప్రయాణికుడిని అనుమానంతో కస్టమ్స్ ఇంటిలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. నిందితుడు హెరాయిన్ క్యాప్సూల్స్ మింగినట్లు గుర్తించారు.