పదో తరగతి పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ - పదో తరగతి పరీక్షలు రద్దు వార్తలు
17:09 June 20
పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా.... విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల కారణంగా....తెలంగాణ, తమిళనాడు ఇతర రాష్ట్రాలు పదోతరగతి పరీక్షలను రద్దుచేశాయి. పరీక్షల నిర్వహణపై మల్లగుల్లాలు పడిన ప్రభుత్వం ఎట్టకేలకు కీలక ప్రకటన చేసింది. ప్రధానంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని...పరీక్షలు రద్దు చేసినట్లు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.
మొదట పదో తరగతి పరీక్షలను జులై 10నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. పరీక్షల నిర్వహణ కోసం 11 పేపర్లను 6కు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆన్‌లైన్, దూరదర్శన్ ద్వారా పాఠాలు కూడా బోధించారు. రోజురోజుకూ కరోనా వ్యాప్తి కారణంగా.... పరీక్షల నిర్వహణ అంత శ్రేయస్కరం కాదని భావించిన ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసింది. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడింగ్ కేటాయించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. మార్కులు, గ్రేడింగ్ కోసం విధి విధానాలు రూపొందించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
అదేవిధంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.