సాగుకు నీరందించేలా ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తోంది. తాజాగా గాయత్రి పంపుహౌస్ నుంచి మధ్యమానేరు జలాశయానికి బుధవారం నాటికి వంద టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఎత్తిపోసిన నీటిని లేదా... గోదావరి నది ద్వారా ఎల్లంపల్లికి వచ్చిన నీటిని దిగువన ఆయకట్టుకు మళ్లించడానికి నంది పంపుహౌస్‌ను మొదట నిర్మించారు. ఒక్కొక్కటి 124 మెగావాట్ల సామర్థ్యం గల ఏడు పంపులు, మోటార్లతో 105 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేలా నిర్మించారు. 2019 ఆగస్టు నుంచి ఇప్పటివరకు 103 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ఈ నీటిని ఎత్తిపోయడానికి ఒక్కో మోటారుకు 9.9 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగినట్లు సమాచారం. ఈ పనిని నవయుగ ఇంజినీరింగ్ సంస్థ పూర్తి చేసింది. ఈ నీరు మేడారం రిజర్వాయర్‌లో చేరిన తర్వాత 1.9 కిలోమీటర్ల కాల్వ, 15 కిలోమీటర్ల దూరం రెండు సొరంగ మార్గాల ద్వారా లక్ష్మీపూర్ సమీపంలో నిర్మించిన గాయత్రి పంపుహౌస్ సర్జిపూల్‌కు చేరిన తర్వాత ఎత్తిపోయడం ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో అత్యధిక సామర్థ్యం గల మోటార్లు ఉన్నది గాయత్రి పంపుహౌస్‌లోనే. 2019 ఆగస్టు 11న ఈ పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోయడం ప్రారంభించారు. అప్పటి నుంచి మధ్యమానేరుకు అవసరమైనప్పుడు ఎత్తిపోస్తున్నారు.
మధ్యమానేరుకు 100 టీఎంసీలు