జనం బాగుంటే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుంది. కానీ కరోనాతో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పరుగుకు అడ్డుకట్ట పడింది. అంతేకాదు.. వృద్ధి రేటు మైనస్‌లోకి దిగజారింది. ఇది జన జీవనంపై ప్రభావం చూపుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ 2020-21లో స్వాతంత్య్రానంతరం ఎన్నడూ లేని స్థాయిలో ప్రతికూల వృద్ధిని (-7.3) నమోదు చేయడం ఆందోళనకు గురిచేస్తోంది. వృద్ధి రేటు తగ్గడం సామాన్యుడి జీవితాన్ని అతలాకుతలం చేసింది.
ఉదాహరణకు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. భారతీయుడి తలసరి స్థూల జాతీయ ఆదాయం 2019-20లో రూ.1,50,320 ఉంది. ఇది నెలకు 12,527 రూపాయలు. వృద్ధి రేటు తగ్గడం వల్ల తలసరి స్థూల జాతీయ ఆదాయం 2020-21లో రూ.1,44,320కు పడిపోయింది. అంటే నెలకు రూ.12,027 అయింది. ఒకవైపు అవసరాలు, మరోవైపు ధరలు పెరుగుతున్నందున సామాన్యులపై.. ప్రత్యేకించి కూలీనాలీ చేసుకునే వారిపై పెనుభారం పడుతోంది. వారి ఆదాయాలూ తగ్గుతున్నాయి. అందుకే దేశంలో ఆరోగ్య పరిస్థితులతోపాటు ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చడం ప్రాధాన్య అంశంగా మారింది.
ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై హైదరాబాద్ యూనివర్సిటీ అర్థశాస్త్ర ఆచార్యుడు జి.ఓంకార్‌నాథ్ సూచనలతోపాటు భారత్ గతంలో లోటు వృద్ధిని ఎదుర్కొన్న సందర్భాలు, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యాన్ని చేరేందుకు ఇంకా భారత్ ఎంత దూరం ప్రయాణించాలి? అనే అంశాలపై.. సమగ్ర కథనం.
ప్రతికూల వృద్ధి లోటు.. అంటే జనజీవనం అతలాకుతలం అయినట్లే.. అన్ని రంగాల్లోనూ మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఉత్పత్తులు తగ్గడం వల్ల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. ఉత్పత్తులు ప్రజలకు చేరే వరకూ మధ్యలో ఉండే కార్యకలాపాలపై ఆధారపడి జీవించేవారంతా దెబ్బతింటారు. ఉదాహరణకు కార్ల విక్రయాలు తగ్గితే షోరూమ్‌లు, మెకానిక్ షెడ్లు, బీమా వ్యాపారాలు తదితరాలపై జీవించేవారూ దెబ్బతింటారు.
ఆదాయాలు కోల్పోయిన వారంతా ఖర్చులను బలవంతంగా తగ్గించుకుంటారు. ఈ ప్రభావం వివిధ రకాల వ్యాపారాలపై తీవ్రంగా ఉంటుంది. ప్రతికూల వృద్ధి వల్ల ప్రధానంగా నిరుద్యోగం, దానివల్ల పేదరికం పెరుగుతాయి. ప్రభుత్వాలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయాలు తగ్గుతాయి. అభివృద్ధిపై, సంక్షేమంపై అవి పెట్టే ఖర్చు తగ్గుతుంది. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో పన్నులు, సెస్సులను పెంచితే ఆ భారాన్ని ప్రజలే మోయాల్సి ఉంటుంది.
‘5 ట్రిలియన్ డాలర్ల’ మాటేమిటి?
2024-25 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటనలు చేశారు. అయిదు ట్రిలియన్ డాలర్లు అంటే 364.73 లక్షల కోట్ల రూపాయలు. వర్తమాన ధరల ప్రకారం మదింపు చేస్తే ఇది నామమాత్రం. భారత్ జీడీపీ 2020-21లో రూ.197.46 లక్షల కోట్లు ఉంది. ఇది అంతకుముందు 2019-20లో సాధించిన రూ.203.51 లక్షల కోట్లతో పోలిస్తే 3శాతం తక్కువ. 2018-19లో ఇది రూ.188.86 లక్షల కోట్లు.
అంటే రెండేళ్లలో పెరుగుదల 8.58 లక్షల కోట్లే. ఈ పరిస్థితుల్లో 2025నాటికి భారత జీడీపీ రూ.364.73 లక్షల కోట్ల స్థాయికి చేరాలంటే భారత్ గతేడాదితో పోలిస్తే అదనంగా నాలుగేళ్లలో రూ.167.27 లక్షల కోట్ల జీడీపీ స్థాయిని సంతరించుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా దాదాపు 17 శాతం వృద్ధి సాధించాలి. అందుకే ఇది అసాధ్యమైన లక్ష్యమని, దీన్ని ఇప్పట్లో చేరుకోలేమని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రంగరాజన్ వంటివారు చెబుతున్నారు.
ప్రతికూల వృద్ధి ఎందుకంటే..
స్వాతంత్య్రానంతరం గత ఆర్థిక సంవత్సరానికంటే ముందు 1979-80లో భారత్ అతి పేలవంగా ప్రతికూల వృద్ధిని (-5.2) నమోదు చేసింది. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో నెలకొన్న తీవ్రమైన కరవు దీనికి ఒక కారణం. ఇరాన్‌లో రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన విప్లవం వల్ల భారత్‌కు ముడిచమురు సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. దీంతో ఆ ఏడాది ఇంధన ధరలు దేశంలో రెట్టింపయ్యాయి. దేశానికి 1979లో కొంతకాలం మొరార్జీదేశాయ్, మరి కొంతకాలం చరణ్‌సింగ్ ప్రధానులుగా ఉన్నారు. 1980 జనవరిలో ఇందిర ప్రధాని అయ్యారు. 1979లో దేశంలో నెలకొన్న అస్థిర రాజకీయ పరిస్థితుల వల్ల కూడా కేంద్రం ఆర్థిక రంగాన్ని మెరుగుపర్చే చర్యలను తీసుకోలేకపోయిందనే విమర్శలున్నాయి.