ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / business

Covid Effect: 'కరోనా రెండో దశతో ఆర్థిక రంగంపై పెను ప్రభావం' - corona effect on Financial sector

ఆర్థిక రంగంపై కరోనా మొదటి దశ కంటే రెండో దశ ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఆదా చేసుకున్నదంతా ఖర్చయిపోయి, అప్పులపాలై, వేతనాల్లో కోతపడి, సరైన ఆదాయం లేక ప్రజలు సతమతం అవుతుండగానే రెండో దశ తీవ్రంగా దాడి చేసింది. ప్రజల ఆదాయం, ఆహార భద్రత, విద్య, ఆరోగ్యం.. ఇలా అన్ని రంగాలనూ కోలుకోలేని దెబ్బతీసిందని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌ అమిత్‌ బసోల్‌ అభిప్రాయపడ్డారు.

Covid Effect economical condition of India
Covid Effect economical condition of India

By

Published : Jun 2, 2021, 8:08 AM IST

కరోనా మొదటి దశ పట్టణ ఆర్థిక వ్యవస్థ (Economy)ను దెబ్బతీయగా.. రెండో దశ పట్టణ, గ్రామీణ రెండింటి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిందని అజీమ్ ప్రేమ్​జీ విశ్వవిద్యాలయం ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ (Professor of Economics) అమిత్​ బసోల్​ అభిప్రాయం వ్యక్తం చేశారు. కొవిడ్​ నియంత్రణతో పాటు సంక్షేమ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇచ్చిన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

అమెరికాలోని బక్‌నెల్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మస్సాచూసెట్స్‌ అమ్‌హర్‌స్ట్‌ విశ్వవిద్యాలయాల్లో పనిచేసిన బసోల్‌.. గత నాలుగేళ్లుగా బెంగళూరులోని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. వివిధ రంగాల్లో కొవిడ్‌ చూపిన ఆర్థిక ప్రభావంపై ఈయన ఆధ్వర్యంలో ఇటీవల ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా-2021’(State of Working India) పేరుతో చేసిన అధ్యయనంలో వెలువడింది. ఈ నేపథ్యంలో ఈనాడు ప్రత్యేక ప్రతినిధి ఎం.ఎల్​.నరసింహారెడ్డికి ఇచ్చిన ముఖాముఖిలో వివిధ వర్గాలపై కరోనా చూపిన ప్రభావం గురించి ఆయన వెల్లడించారు.

ఒక దశ నుంచి కోలుకోకముందే రెండో దశ వచ్చింది. మీ అధ్యయనం ప్రకారం ఏ వర్గాలపై ఈ ప్రభావం ఎక్కువ..?

ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం(Financial Crisis) నుంచి కోలుకోకముందే మరింత తీవ్రంగా రెండోది వచ్చింది. అన్ని వర్గాలపై దీని ప్రభావం పడినా యువత, మహిళలు ఎక్కువ నష్టపోయారు. మొదటి దశలో పనిచేస్తూ వెళ్లిపోయిన పురుషుల్లో 61 శాతం మంది తిరిగివచ్చారు. మిగిలిన వారిలో 32 శాతం మంది కొంత ఆలస్యంగానైనా తక్కువ వేతనానికి చేరగా, 7 శాతం మంది తిరిగి పనుల్లో చేరలేదు. మహిళల్లో 47 శాతం మంది 2020 ఆఖరుకు కూడా తిరిగి చేరలేదు. 15-24 సంవత్సరాల మధ్య వయసు కార్మికుల్లో 33 శాతం మంది 2020 ఆఖరు నాటికీ పనిలో తిరిగి చేరలేకపోయారు.

రెండో దశతో పేదరికం, అసమానతలు పెరిగాయి. ఒక కుటుంబంలో సగటున 3.6 మంది ఉంటే ఆ కుటుంబం కనీస వేతనం గ్రామీణ ప్రాంతాల్లో రూ.375, పట్టణాల్లో రూ.430 ఉండాలని.. ఇంత కంటే తక్కువ ఉంటే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు పరిగణించాలని అనూప్‌ సత్పతి కమిటీ సూచించింది. కరోనా సంక్షోభానికి ముందు కూడా నిర్ణయించిన కనీస ఆదాయం కంటే తక్కువ కలిగిన కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో 25.4 శాతం ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 15.6 శాతం ఉన్నాయి. మొదటి ఎనిమిది నెలల కరోనా మహమ్మారి తర్వాత ఇవి గ్రామీణ ప్రాంతాల్లో 41 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 35.3 శాతానికి పెరిగాయి. కోట్ల కుటుంబాలు అదనంగా పేదరికంలోకి వచ్చాయి.

ఆర్థిక సంక్షోభంతో ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, వలస కార్మికులు.. వీరిలో ఎవరికి ఎక్కువ నష్టం కలిగింది?

ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అంశం ఇది. మొదటి లాక్‌డౌన్‌లో అసంఘటిత రంగ కార్మికులు(Unorganized Sector Workers) తీవ్రంగా నష్టపోయారు. కుటుంబాల్లో పేదరికం పెరిగింది. ఆహార భద్రత సమస్యతో పాటు రుణభారం పెరిగింది. రెండో దశ కరోనాతో ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో చాలా మంది ఉపాధి కోల్పోయారు. పట్టణ ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వచ్చే వలస కార్మికులు, పట్టణాల్లో స్వయం ఉపాధితో జీవించే వీధి వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసుకునేవారు, ధోబీలు.. ఇలా పలు రంగాలకు చెందిన వారిపై తీవ్ర ప్రభావం పడింది. విద్యా రంగంలో పనిచేసే 18 శాతం మంది వ్యవసాయంలోకి, ఆరోగ్య రంగంలోకి, చిన్న చిన్న వ్యాపారాల్లోకి మారారు. 20 శాతం కుటుంబాలు తమ ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయాయి. ధనిక కుటుంబాలూ కరోనా ముందు వచ్చిన ఆదాయంలో నాలుగో వంతు నష్టపోయాయి.

దీర్ఘకాలంలో కరోనా ప్రభావం ఎలా ఉంటుంది?

దీర్ఘకాల ప్రభావాలను ఊహించడం కష్టం. అయితే ఇప్పుడు అవసరమైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి తీవ్రంగా మారుతుంది. అప్పులపాలైన కుటుంబాలు భవిష్యత్తులో విద్య, ఆరోగ్యం.. లాంటి వాటిపై పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. పిల్లల చదువులు దెబ్బతింటాయి. సూక్ష్మ, చిన్నతరహా వ్యాపారాలు శాశ్వతంగా మూతపడొచ్చు. యువ కార్మికులు నిరుద్యోగులుగా మారే అవకాశం ఎక్కువ. మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం వారి కుటుంబాలకు సమస్య కావడంతో పాటు సామాజిక సమస్యలూ ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. రెండో దశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది?

జీడీపీ వృద్ధిరేటు(GDP growth rate)పై కరోనా ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయడం కష్టం. అయితే రెండో దశకు అంచనా వేసినదాని కంటే తక్కువగా ఉంటుంది. ఎంత అన్నదానిపై కేంద్ర గణాంకాల శాఖ 2020-21 సంవత్సర వివరాలు విడుదల చేసిన తర్వాత మరింత స్పష్టత వస్తుంది. ప్రస్తుత లాక్‌డౌన్లలో నిషేధాజ్ఞలు తక్కువ. పలు రంగాలు పనిచేశాయి. అయితే అసంఘటిత కార్మికులు, పేద కుటుంబాలపై మాత్రం ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటి?

ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచిత రేషన్‌ను జూన్‌ తర్వాత కూడా కొనసాగించాలి. కనీసం 2021 ఆఖరు వరకు ఇవ్వాలి. ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్న అన్ని కుటుంబాలకు నెలకు రూ.5 వేల చొప్పున మూడు నెలల పాటు నగదు బదిలీ చేయాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు విస్తరించడంతో పాటు కనీస వేతనాన్ని పెంచాలి. ఉపాధి హామీ బడ్జెట్‌ను రూ.లక్షా 75 వేల కోట్లకు పెంచాలి. వృద్ధాప్య పింఛన్లకు కేంద్రం ఇచ్చే వాటాను కనీసం రూ.500 పెంచాలి. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు నెలకు రూ. 5వేల చొప్పున ఆరు నెలలపాటు కొవిడ్‌ అలవెన్సు ఇవ్వాలి. ప్రభుత్వం అదనంగా చేసే ఖర్చు సుమారు రూ.5.5 లక్షల కోట్లు. ఇది రెండేళ్ల జీడీపీలో 4.5 శాతం మాత్రమే.

ఇదీ చూడండి:

covid vaccination: రాష్ట్రంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి టీకా పూర్తి!

ABOUT THE AUTHOR

...view details