ఐదేళ్ల చంద్రబాబు పాలన రాష్ట్రాన్ని అవినీతికూపంగా మార్చేసిందని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించిన ఆయన తెదేపా పాలనపై విమర్శలు చేశారు. ప్రజాసంకల్ప పాదయాత్ర ఏలూరు మీదుగా సాగిందని గుర్తు చేసిన జగన్.. ఆ రోజున ప్రజలు తనకు చెప్పుకున్న సమస్యలను తొందరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఏలూరు రోడ్ షో లో జగన్
పేదవారి కోసం కట్టించే ఇళ్ల నిర్మాణాలలో భారీగా అవినీతి జరిగిందని వైకాపా అధినేత ఆరోపించారు. మూడు లక్షల రూపాయల విలువ చేయని ఇళ్లను పేదవారికి 6 లక్షలకు అమ్ముతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం లక్షన్నర మాత్రమే ఇస్తున్నాయన్నారు. మిగిలిన అప్పును తీర్చడానికి సుదీర్ఘకాలం పడుతుందన్నారు.
అధికారంలోకి రాగానే ఏలూరులో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చే ప్రణాళికలను రూపొందిస్తామన్నారు. డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసేందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలో నిధులు మంజూరైనా తెదేపా నేతలు ఆ నిధులను దుర్వినియోగం చేశారన్నారు.
"2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ అయినా నెరవేరిందా అని ప్రశ్నిస్తున్నా? రుణమాఫీ, ఇళ్ల నిర్మాణం, పోలీసు వ్యవస్థ పటిష్ఠ, ఇంటికో ఉద్యోగం..ఇలాంటి హామీలతో 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. మళ్లీ తిరిగి అవే హామీలతో చంద్రబాబును ప్రచారానికి వస్తున్నారు" ---వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్