చంద్రబాబు లేఖపై.. రాజకీయం చేస్తారా?: యనమల - letter
తెదేపా అధినేత చంద్రబాబు.. ప్రజావేదిక కోసం సీఎం జగన్ కు లేఖ రాయడంపై.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఖండించారు. చంద్రబాబు లేఖను రాజకీయంగా చూడటం సరికాదన్నారు.

ప్రజావేదికను తెదేపా కార్యాలయ అవసరాలకు ఇవ్వాలని చంద్రబాబు.. సీఎం జగన్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. చంద్రబాబు మొదటి లేఖ ప్రజా సమస్యలపై ఉంటుందని అనుకున్నానని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా మొదటి లేఖ రాసిన చంద్రబాబు.. అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు సహకరిస్తామని చెప్పిన విషయం గుర్తు చేశారు. అలాంటిది చంద్రబాబు.. జగన్ కు రాసిన తొలి లేఖలో ప్రజా సమస్యలు ప్రస్తావించలేదనడం.. విజయసాయి చెబుతున్న అబద్ధాల చిట్టాలో మరొకటని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెప్పీ చెప్పీ విజయసాయికి అబద్ధాలు అలవాటైపోయాయని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారపక్షం పాత్ర ఎంతో, ప్రతిపక్షం పాత్ర అంతకన్నా అధికంగా ఉంటుందని విజయసాయి రెడ్డి గ్రహించాలన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నివాసానికి సమీపానే ఉన్నప్రజావేదికను కార్యాలయ అవసరాలకు ఇవ్వాలని కోరడాన్ని కూడా తప్పు పట్టడం తగదని హితవు పలికారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే.. వివిధ వర్గాల ప్రజలతో భేటి అయ్యేందుకు, వారి ఇబ్బందులు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ఇది దోహదపడుతుందన్న కారణంగానే.. చంద్రబాబు కోరారని వివరించారు. ఈ లేఖనూ రాజకీయంగా చూడటం, వ్యంగ్యంగా మాట్లాడటం తగనిపని అని ఆగ్రహం వ్యక్తం చేశారు.