యాదాద్రి ... ఒకప్పుడు తెలంగాణకే పుణ్యస్థలి... తిరునాళ్ల లోగిలి... తెలుగుప్రజల ఇలవేల్పు గుడి. నేడు... ప్రపంచ ప్రజలనందరినీ ఆకర్షించే బ్రహ్మాండనాయకుని బృహద్ నిర్మాణం. ఒకనాడు యాదా మహఋషి తపస్సు చేసి వరప్రసాదంగా పొందిన యాదగిరి గుట్ట నారసింహాలయం. పాతగుట్టపై వెలసినట్లు చెప్పుకునే పాత నరసింహ దేవస్థానం. అదే ... ఇదుగో ఇలా అత్యాధునిక దేవస్థానంగా... ప్రపంచవ్యాప్త జనుల కనులవిందుగా అవతరించనున్న యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి దేవస్థానం.
యాదాద్రి వైభవం... త్వరలో ఆవిష్కృతం - telangana temples
అంతర్జాతీయ స్థాయిలో ప్రజలందరినీ ఆకర్షించేంత హంగులతో నారసింహుని కోవెల నిర్మాణం జరుగుతోంది. అందుకోసం అనేక ప్రాంతాలకు చెందిన నిష్ణాతులైన స్తపతులను, వారి శిష్యబృందాలను, శిల్పకారులను, సమర్థులైన పనివారిని నియమించారు. ఉలులతో శిలలకు ప్రాణం పోస్తున్నారు.
మాడవీధులు అనగానే మనకు తిరువనంతపురం, శ్రీరంగం, తిరుపతి వంటి మహా క్షేత్రాలు గుర్తుకు వస్తాయి. దాదాపు అంతకుమించిన స్థాయిలో ఈ విన్నూత్న యాదాద్రి ఆలయంలో కూడా మాడవీధులు ఏర్పడబోతున్నాయి. ఇది పశ్చిమాభిముఖ నారసింహుని దేవస్థానం మహారాజగోపురం పక్కన ఆలయ ఆగమ వాస్తు ప్రకారం చేయవలసిన ప్రదక్షిణా రీతిలో ఇది ఉత్తర మాడవీధి... మలుపు తిరిగితే రూపుదిద్దుకోబోతున్న తూర్పుమాడవీధి. అలా తలతిప్పి చూస్తేనా... యాదాద్రి దిగువ అందమైన క్షేత్రం, తాత్కాలిక బాల ఆలయం, తదితర దృశ్యాలు కనువిందు చేస్తాయి. రండి...రండి... ఇటు తిరిగితే దక్షిణ మాడవీధి... ఇవన్నీ పూర్తిగా తయారయ్యాక చూస్తేనా... ఎంత అద్భుతంగా ఉండబోతోందో ఊహలకు అందుతోంది కదూ.
దాదాపు 1500 మంది శిల్పులను, వారికి దర్శకత్వమిస్తూ 30మందికి పైగా స్తపతులు, వీరందరి పనిని పర్యవేక్షిస్తూ ప్రధాన రూపశిల్పిగా ప్రధాన స్తపతి, సుందరీకరణ, వాస్తు శిల్ప శైలులను ఎప్పటికప్పుడు చెప్పి చేయించే ఆర్కిటెక్చర్, పెద్దపెద్ద క్రేన్‌లు, చిన్న క్రేన్‌లు, ఆధునిక యంత్రసామగ్రిలతో సాంప్రదాయ పనిముట్లయిన సుత్తి, సమ్మెట, శానం, ఉలి, చెక్కుడు పౌగార్లు, యన్‌గ్రేవర్లు, మెకనైజ్డ్ కట్టర్లు వంటి ఆధునిక యంత్రపరికరాలతో శ్రమించే వందలాది మంది పనివార్లతో తెలంగాణ కలలు కన్న దివ్యాలయం త్వరత్వరగా రూపుకడుతోంది.