తిరుమల శ్రీవారి దర్శించేందుకు నేడు ప్రముఖులు సందర్శించారు. ప్రారంభ దర్శనంలో సీనీనటి, కర్ణాటక రాష్ట్ర మండ్యా ఎంపీ సుమలత పాల్గొన్నారు. నరేంద్ర మోదీ పర్యటనను పర్యవేక్షించేందుకు తిరుపతికి వచ్చిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేక దర్శనంలో తిరుమలేశుని సేవలో పాల్గొన్నారు. హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో తరించడానికి గవర్నర్ దంపతులు తిరుమలకు విచ్చేశారు.
స్వామివారి సేవకై వచ్చిన గవర్నర్
తిరుమల శ్రీవారిని గవర్నర్ నరసింహన్ దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి నిర్వహించిన సర్కారీ సహస్ర కళశాభిషేకం సేవలో గవర్నర్ దంపతలు పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టాక...
కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని సందర్శించారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు తితిదే అధికారులు స్వాగతం పలికారు. హోంశాఖ సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టిన ఆయన శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం ఆక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. గతంలో తిరుమల అడవుల్లో పర్యటించి ఎర్రచందనం చెట్లను నరికివేస్తున్న పరిస్థితులను ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకువెళ్లినట్లు గుర్తు చేశారు. స్వామివారి కృపతో తనకు హోదా వచ్చిందని... కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కృషిచేస్తానని తెలిపారు.