కొవిడ్ రోగుల(corona patients) నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రితో పాటు బేగంపేటలోని విన్, కూకట్‌పల్లిలోని మ్యాక్స్‌హెల్త్, కాచిగూడలోని టీఎక్స్, సనత్‌నగర్‌లోని నీలిమ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది. కరోనా వైద్యానికిచ్చిన అనుమతులను రద్దు చేసింది. కొత్తగా కొవిడ్ రోగులను చేర్చుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్నవారికి ప్రొటోకాల్ ప్రకారం చికిత్స అందించాలని చెప్పింది. ఆదేశాలను అమలు చేయకపోతే ఆసుపత్రి లైసెన్సులను రద్దు చేయక తప్పదని ప్రజారోగ్య సంచాలకుడు(డీహెచ్)(DH) డాక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నాయని, కొన్ని ఆసుపత్రులు రోజుకు లక్ష వరకు తీసుకుంటున్నాయని 88 ఫిర్యాదులొచ్చాయి. మొత్తం 64 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం, అయిదింటిపై వెంటనే చర్యలు తీసుకుంది. బిల్లులో ఉన్న తేడాలు, ట్రీట్‌మెంట్ ప్రొటోకాల్ తదితర అంశాలతో 24 గంటల లోగా సమాధానం ఇవ్వాలని, స్పందించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని ఆసుపత్రులను హెచ్చరించింది. నోటీసులో ఎవరి నుంచి ఫిర్యాదు వచ్చిందో కూడా పేర్కొన్నారు.
- విరించి ఆసుపత్రిపై నల్గొండజిల్లాకు చెందిన మృతుడు వంశీకృష్ణ బంధువులు ఫిర్యాదు చేశారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేశారని, కొవిడ్ ప్రొటోకాల్ పాటించలేదని గురువారం ఫిర్యాదు వచ్చింది. దీనిపై 24 గంటల్లోగా బదులివ్వాలని, అదే రోజు వైద్యఆరోగ్యశాఖ షోకాజ్ నోటీసు జారీచేసింది. సమాధానం రానందున చర్యలు తీసుకున్నారు.
- విన్(వి.ఐ.ఎన్.ఎన్) ఆసుపత్రిలో సరైన వైద్యం చేయకపోవడంతో పాటు భారీగా బిల్లులు వేశారని మోసిన్ ఉస్మని, గైరమ్మ, సుభాస్.కె.రామచంద్ర, సంధ్యల నుంచి ఫిర్యాదులు అందగా... 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆసుపత్రికి డీహెచ్ నోటీసు ఇచ్చారు. అసుపత్రి స్పందించింది. అయితే అధిక బిల్లులపై ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని భావించిన వైద్యఆరోగ్యశాఖ అనుమతిని రద్దుచేసింది. మ్యాక్స్‌హెల్త్, టీఎక్స్, నీలిమ ఆసుపత్రుల వివరణా అలాగే ఉండటంతో సర్కారు కన్నెర్రజేసింది.
డీహెచ్‌కు మంత్రి కేటీఆర్(KTR) ఆదేశం
అంతకు ముందు విరించి, బోయినపల్లిలోని రాఘవేంద్ర ఆసుపత్రులపై వచ్చిన అభియోగాల మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ డీహెచ్‌ని ఆదేశించారు. అధికఛార్జీలు(HIGH FEES), నిర్లక్ష్యం వల్ల గత ఏడాది విరించి లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దుచేసిందని, అయినా అక్కడే తాజాగా మళ్లీ అలాంటి ఘటనే జరిగిందని ముబాషిర్ అనే యువకుడు కేటీఆర్‌కు ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేశారు.రాఘవేంద్ర ఆసుపత్రిపై శివప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి వైద్యఆరోగ్యశాఖ జారీ చేసిన సంజాయిషీ నోటీసును డీహెచ్ ట్విటర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.