విజయవాడ ఏ కన్వెన్షన్ వేదికగా తెలుగుదేశం పార్టీ...ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తెదేపా కార్యకర్తలు, నాయకులపై జరిగిన దాడులను జిల్లాల వారీగా సేకరించనున్నారు. పార్టీ శ్రేణులకు అండగా ఉండేందుకు ఓ టోల్ ఫ్రీ నెంబర్ను తెదేపా ఏర్పాటుచేసింది. దాడులను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై అధినేత చంద్రబాబు కార్యచరణ రూపొందించనున్నారు.
ఓటమి కారణాలపై తెదేపా విశ్లేషణ...నేడు విజయవాడలో సమీక్ష నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియజేసే వ్యవస్థను శ్రేణులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను ఈ సమావేశంలో విశ్లేషించనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఓటమి లేని స్థానాలు, నియోజకవర్గం ఏర్పడి నాటి నుంచి విజయాలు నమోదు చేసిన సీట్లలలో ఈసారి ఓటమి పాలవ్వడంపై వాస్తవాలేమిటనే కోణంలో అధ్యయనం చేయనున్నారు.
జన్మభూమి కమిటీల వ్యవహారం, అభివృద్ధి, సంక్షేమాన్ని కార్యక్రమాల పేరిట ప్రభుత్వం అందించిన లబ్ధిని జన్మభూమి కమిటీల తీరు దెబ్బతీశాయా..తీస్తే 150 స్థానాల్లో ఆ ప్రభావం పడిందా అనే చర్చ సమావేశంలో జరగనుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్కు పడకుండా పవన్ కల్యాణ్ చీలుస్తాడనుకున్నది విఫలమవటం..జనసేన పోటీ తెలుగుదేశం కంటే వైకాపాకే మేలు చేసిందనే అభిప్రాయం నేతలు నుంచి వ్యక్తమవుతున్నా...అది ఎన్ని స్థానాలకు పరిమితమైందో చర్చించనున్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్న బీసీలు... గత అయిదేళ్లలో కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇవ్వటం వల్ల పార్టీకి దూరంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీకి అండగా నిలిచే కొన్ని సామాజిక వర్గాలను పొగొట్టుకున్నామనే భావన నేతల్లో ఉంది. వీటిపై సమీక్షలో సమగ్ర విశ్లేషణ జరగనుంది. పార్టీ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించిన చంద్రబాబు...ఆ దిశగా శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇదీ చదవండి :ఈఎస్ఐ పరిధి ఉద్యోగులకు కేంద్రం శుభవార్త