ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'బెల్టు షాపులను పూర్తిగా తొలగించాలి' - బెల్టు షాపులు

రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ అమలుకు అనువుగా ఈ విధానాన్ని తీర్చిదిద్దుతున్నారు అధికారులు. మొదట గ్రామాల్లోని గొలుసు దుకాణాలు ఎత్తివేయింయే చర్యలు ప్రారంభించారు. రేపటి నుంచి క్షేత్రస్థాయిలో గొలుసు దుకాణాల నిర్వాహకులకు కౌన్సిలింగ్‌ ఇస్తారు. గొలుసు దుకాణాలు తీసేయకుంటే ఏ దుకాణదారు పరిధిలో ఉందో ఆ లైసెన్సు రద్దు చేస్తారు. కొత్త మద్యం విధాన రూపకల్పన కోసం ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులు అధ్యయనం చేసేందుకు అధికారులను ఎక్సైజ్‌శాఖ పంపుతోంది.

ఎక్సైజ్ శాఖ సమీక్షా సమావేశం

By

Published : Jun 4, 2019, 7:05 PM IST

Updated : Jun 5, 2019, 10:03 AM IST

ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మద్య నిషేధం అమలు విషయమై అబ్కారీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని బెల్ట్ షాపులను నూటికి నూరు శాతం ఎత్తివేయాలని ఆదేశించారు. దశలవారీగా మద్యాన్ని ఎత్తి వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పాదయాత్రకు ముందు ప్రకటించిన నవరత్నాలు పథకంలో దశలవారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు అన్ని జిల్లాల ఎక్సైజ్‌శాఖ అధికారులతో విజయవాడలోని కమిషనర్‌ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు, ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ ముఖేష్‌కుమార్‌మీనా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ హరికుమార్‌ ఆధ్వర్యంలో మద్యం గొలుసు దుకాణాల నిర్మూలనపై ప్రధానంగా చర్చించారు. గ్రామాల్లో ఉండే గొలుసు దుకాణాలు ఎవరు నిర్వహిస్తున్నారు? ఏ దుకాణం నుంచి మద్యం చేరుతోంది? వాటి వెనుక ఎవరున్నారో ఎక్సైజ్‌ సిబ్బందికి తెలియంది కాదని- ప్రభుత్వ విధానాలు పరిగణనలోకి తీసుకుని ప్రతి ఒక్కరు పనిచేయాల్సిందేనని ఉన్నతాధికారులు సుస్పష్టం చేశారు. వీటిని తొలగించేందుకు ప్రతి గ్రామానికి ఓ కానిస్టేబుల్‌ను... మండలానికి ఎస్‌.ఐ.ని బాధ్యున్ని చేస్తామని- నూరు శాతం ఫలితాల సాధనలో ఎవరు అలసత్వం ప్రదర్శించినా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మెరుగైన ఫలితాలు సాధించిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ప్రతి ఎక్సైజ్‌ స్టేషన్‌ నుంచి రోజువారీ నివేదిక పంపాలన్నారు. 3 వారాల్లో కొత్త మద్యం విధానం రానుందని చెప్పారు.
ప్రభుత్వమే మద్యం దుకాణాల నిర్వహించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపైనా అబ్కారీశాఖ కసరత్తు చేస్తోంది. కేరళ, తమిళనాడు, కర్నాటక, పొరుగు రాష్ట్రాల్లోని మద్యం విధానాల పరిశీలనకు బృందాలను ఆయా ప్రాంతాలకు పంపిస్తోంది. రాష్ట్రంలో గంజాయి గంజాయి అక్రమ రవాణా- గంజాయి సాగుపైనా ఈ సమావేశంలో చర్చించారు. గంజాయి పండించేందుకు వర్షాకాలం అనువైందని- ఆదిలోనే పంట పండించకుండా అడ్డుకోగలిగితే తర్వాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని భావించిన ఉన్నతాధికారులు సాగు ప్రాంతాలపై నిఘా పెంచాలన్నారు.
Last Updated : Jun 5, 2019, 10:03 AM IST

ABOUT THE AUTHOR

...view details