చిత్తూరు జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. జిల్లాలోని పార్లమెంటరీ, అసెంబ్లీ స్థానాలకు కీలక అభ్యర్థులందరూ నామపత్రాలు సమర్పించారు. వరుసగా సెలవులు రానుండటం..చివరిరోజు హడావుడి ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున... శుక్రవారం లోక్‌సభకు 16, శాసనసభకు 14 నామినేషన్లు దాఖలయ్యాయి.
రాజంపేట పార్లమెంట్ స్థానానికి తెదేపా అభ్యర్థి డీఏ. సత్యప్రభ...వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, కాంగ్రెస్ నేత షాజహాన్ భాషా నామినేషన్లు దాఖలు చేశారు. చిత్తూరు ఎంపీ బరిలో ఉన్న వైకాపా నాయకుడు నల్లగొండగారి రెడ్డప్ప, కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా చీమల రంగప్ప నామపత్రాలు సమర్పించారు.
జిల్లాలోని 14 శాసనసభ స్థానాలకు ప్రధాన పార్టీల నేతలందరూ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారని సమాచారం. కుప్పం తెదేపా అభ్యర్థిగా సీఎం చంద్రబాబు తరఫున...పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రికి పోటీగా వైకాపా నేత, విశ్రాంత ఐఏఎస్ అధికారి చంద్రమౌళి నామినేషన్ వేశారు.
తిరుపతి శాసనసభ బరిలో ఉన్న తెదేపా అభ్యర్థి సుగుణమ్మ, వైకాపా నుంచి భూమన కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ నేత ప్రమీలమ్మ నామపత్రాలు దాఖలు చేశారు. చిత్తూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న తెదేపా నాయకుడు ఏఎస్. మనోహర్, వైకాపా అభ్యర్థి జంగానపల్లి శ్రీనివాసులు నామినేషన్ సమర్పించారు.