కొత్త హంగు సమకూర్చుకున్న తూర్పునౌకాదళం - eastern naval command
భారత నౌకాదళం మరో కొత్త హంగు సమకూర్చుకుంది. ఇప్పటివరకు అత్యవసర సమయంలో ప్రత్యేక అపరేషన్ ద్వారా నౌకలలో చిక్కుకున్న సిబ్బందిని రక్షించగల సామర్ధ్యం నౌకాదళానికి ఉంది. ఇప్పుడు జలాంతర్గాములలో ఉన్న సిబ్బందిని కూడా సురక్షితంగా బయటకు తీసుకువచ్చే సామర్ధ్యాన్ని సమకూర్చుకుంది. 'డీప్ సబ్ మెర్జన్స్ రెస్క్యూ వెహికల్' ద్వారా జలాంతర్గామి నుంచి సిబ్బందిని బదిలీ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించారు. సముద్రంలో అత్యంత క్లిష్టతరమైన ప్రక్రియల్లో ఇది ఒకటి. సిబ్బందిని జలాంతర్గామి నుంచి బయటకు తీసుకురావడం ద్వారా తమ సత్తా చాటి చెప్పారు విశాఖ తూర్పు నౌకాదళం.

అత్యవసర సమయాల్లో జలాంతర్గామి నుంచి సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఈ తరహా ఆపరేషన్ నిర్వహించాల్సి వస్తుంది. డీస్ సబ్ మెర్జన్స్ రెస్క్యూ వెహికల్ విశాఖ కేంద్రంగా నౌకాదళం సమకూర్చుకుంది. సముద్ర గర్భంలో లోతున ఉన్న జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధుధవజ్ నుంచి ఈ ప్రత్యేక నౌక ద్వారా సిబ్బందిని బదిలీ చేయగలిగారు. ఈ ఆపరేషన్ మొత్తం పూర్తిగా దేశీయ నిపుణుల పర్యవేక్షణలోనే జరగడం విశేషం. హిందూ మహాసముద్రం ప్రాంతంలో పెరుగుతున్న నౌకాదళ అవసరాల దృష్ట్యా ఈ తరహా అపరేషన్ అవసరం ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నందున దానికి సన్నద్దతగా చేసిన ప్రక్రియ విజయవంతం కావడంతో అధికార వర్గాలు సంతృప్తి ప్రకటించాయి. తూర్పు తీరంలో ఈ రకమైన శిక్షణ కార్యక్రమం నౌకాదళ సిబ్బంది, ప్రత్యేకించి జలాంతర్గామి సిబ్బంది ధైర్యం మరింతగా పెంచుతోంది. ఈ కొత్త సామర్ధ్యాన్ని భారత నౌకాదళం సమకూర్చుకోవడంతో మరో హంగు నౌకాదళానికి చేరినట్టయింది.