వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కు, జనసేనన ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధంలో ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.
సీఏ చదివిన మీ లెక్కలు ఎలా తప్పాయి...?
జనసేన పోటీ చేసింది 65 స్థానాల్లోనే, మరి 88 స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని లక్ష్మీనారాయణ జోస్యం చెబుతున్నారంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ ట్వీట్ కు బదులుగా జనసేన నేత లక్ష్మీనారాయణ, తమ పార్టీ జనసేన స్వయం బలంమీద 140 స్థానాలు, మిత్ర పక్షాలు మరో 35 స్థానాల్లో పోటీ చేశాయని వివరించారు. ఆ వివరణకు తోడుగా... సీఏ చదివిన మీ లెక్కలు ఎలా తప్పాయంటూ విజయసాయిరెడ్డిని విమర్శించారు.
3 నెలల్లో 3 పార్టీలు..!
జనసేన ఎంపీ అభ్యర్థి, లక్ష్మీనారాయణ.. ఎన్నికలకు ముందు... లోక్ సత్తా, తెదేపా, జనసేన.. ఇలా 3 పార్టీలు మారారని మారారని విజయసాయిరెడ్డి విమర్శించారు.
వైకాపాలోకి ఆహ్వానించిన విషయం.. ఎందుకు దాచారు?
విజయసాయిరెడ్డి ట్వీట్ కు లక్ష్మీనారాయణ బదులిచ్చారు. మొదట తనను వైకాపాలోకి రమ్మని విజయసాయిరెడ్డి.. ఎర్రతివాచీ పరిచిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నంచారు. తాను రాజకీయాల్లో చేరతానని చెప్పగానే.. అన్ని పార్టీలు ఆహ్వానం పలికిన విషయాన్ని తానే స్వయంగా మీడియాకు తెలిపానని అన్నారు. వైకాపాలో చేరలేదన్న బాధతో ఇలా మాట్లాడుతున్నారా? అంటూ కౌంటర్ ఇచ్చారు.
అసత్య ట్వీట్లకు సమాధానమిస్తూ.. సమయాన్ని వృథా చేసుకోలేను..
ఈ ట్వీట్ వార్ కు లక్ష్మీనారాయణే ఫుల్ స్టాప్ పెట్టారు. తానిప్పుడు రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం, నిరుద్యోగ నిర్మూలనకు పాలసీ తయారీలో నిమగ్నమై ఉన్నట్టు చెప్పారు. అసత్య ట్వీట్లకు బదులు చెబుతూ విలువైన సమాయన్ని.. వృథా చేయదలుచుకోలేదని తెలిపారు. ఇందుకోసం ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉంటే తెలపగలరు... అంటూ విజయసాయిరెడ్డిని అడిగారు లక్ష్మీనారాయణ. ఇంకా ఏవైనా సమాధానాలు కావాలంటే జనసేన కార్యకర్తలు చెబుతారంటూ, ట్వీట్ వార్ కు ముగింపు పలికారు.