ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అమ్మ  మనోధైర్యం... తనయుడికదే ఆత్మవిశ్వాసం.... - మంగళగిరి

వెలుగులు పంచే విద్యుత్ ఓ కుటుంబంలో చీకటి నింపింది. ఓ వ్యక్తి జీవితాన్ని చిదిమేసింది. ఓ తల్లి కలలను కమ్మేసింది. అయినా ఆ మాతృమూర్తి నీరసించిపోలేదు. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. తన ప్రేమనే ప్రాణంగా చేసి కంటిరెప్పలా కాపాడుతోంది.

అమ్మ  మనోధైర్యం... తనయుడికదే ఆత్మవిశ్వాసం....

By

Published : May 12, 2019, 1:17 PM IST

అమ్మ మనోధైర్యం... తనయుడికదే ఆత్మవిశ్వాసం....
తాడిబోయిన లక్ష్మిది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం. భర్త, భార్య ఇద్దరి సంతానం... సంతోషంగా సాగిపోతున్న సంసారంలో ఒక్కసారి కుదుపు వచ్చింది. ఎర్రబాలెంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో లక్ష్మి కుమారుడు రవీంద్రబాబు గాయపడ్డాడు. చేతులు కోల్పోయాడు. ఓ భవనానికి మార్బుల్ పాలిష్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. కొంత కాలానికి రెండు కాళ్ళూ దెబ్బతిన్నాయి. రవీంద్ర వైద్యం కోసం దాదాపు 20లక్షలకుపైగానే ఖర్చు చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. మూడేళ్లుగా ఆయన మంచానికే పరిమితమయ్యాడు. తల్లే సపర్యలు చేస్తోంది.

ఎన్నో కలలు కన్న రవీంద్ర శాశ్వత దివ్యాంగుడిగా మారాడు. మంచానికే పరిమితమైన కుమారుణ్ని చూసి ఆ తల్లి తల్లడిల్లుతోంది. పురిటి బిడ్డలా సాకుతోంది. ఓవైపు కుమారుడి దయనీయ పరిస్థితి మరోవైపు భర్త అనారోగ్యం ఆమెను మానసికంగా కుంగదీస్తున్నా.. ఆమెలో ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. కన్నీళ్లు దిగమింగుతూనే కుటుంబాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్తోంది. కూలీ పనులు చేస్తూ నెట్టుకొస్తోంది. అచేతనంగా ఉన్న తాను తల్లి ఇచ్చిన ధైర్యంతోనే బతుకుతున్నానని చెబుతున్నారు రవీంద్ర.

ఆస్తి మొత్తం కుమారుడి వైద్యం కోసం ఖర్చు పెట్టామని... ఇక ఖర్చు పెట్టే స్తోమత లేదని వాపోతున్నారు. మెరుగైన వైద్యం చేయిస్తే రవీంద్ర కాళ్లకు చలనం వస్తుందని తెలిసినా ముందుకెళ్లలేకపోతున్నామని కన్నీరుపెట్టుకుంటున్నారీ కన్నవారు.

ABOUT THE AUTHOR

...view details