వైకాపా నేత విజయసాయిరెడ్డి, జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి, పలువురు పార్టీ నేతలు తాడేపల్లి జగన్ నివాసానికి వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపు ఖాయంగా కనిపించడం వలన ఈ నెల 25న శాసన సభాపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వైకాపా నిర్ణయించింది. తాడేపల్లిలోని వైకాపా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్ఠానం భావిస్తుంది. వైకాపా శాసన సభాపక్ష నేతగా వైఎస్ జగన్ను...పార్టీ ఎమ్మెల్యేలు ఈ నెల 25న ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు.
'150 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో గెలుపు మాదే' - ysrcp
సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అత్యధిక స్థానాలు కైవసం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 9 స్థానాల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించగా...ఇంకా 140కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. పార్టీ అనుహ్య విజయంతో వైకాపా నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ నేతలందరూ జగన్ నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
26న గవర్నర్ను కలిసే అవకాశాలున్నాయని పార్టీ నేతలు తెలిపారు. ఈ నెల 30న రాజధాని ప్రాంతంలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాడేపల్లిలోని వైకాపా కేంద్రకార్యాలయం సహా విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. రాజన్న పాలనను జగన్ తిరిగి అందించనున్నారని వైకాపా సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 150 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో గెలిచి...రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని సంతకం చేసే వారికే మద్దతిస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.