ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కూటమికి కింగా, క్వీనా? - భారతీయ జనతా పార్టీ

రాహుల్​ గాంధీ, చంద్రబాబు, మమతా బెనర్జీ, ప్రియాంక గాంధీ... ఇలా కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరన్నదానిపై రకరకాల ఊహాగానాలు. మల్లికార్జున్​ ఖర్గే, ఫరూక్​ అబ్దుల్లా వంటి వారూ తెరపైకి వచ్చే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు. వీటిలో ఏవి నిజం అవుతాయి?

కూటమికి కింగా, క్వీనా?

By

Published : Feb 9, 2019, 12:03 PM IST

సార్వత్రిక ఎన్నికల ముందు జాతీయ రాజకీయాల దశ, దిశపై ఈటీవీ భారత్​ అందిస్తున్న విశ్లేషణాత్మక కథనాల సమాహారంలోని 2వది ఇది.

కూటమికి కింగా, క్వీనా?

ఇది కూడా చదవండి: కదం తొక్కుతున్న కూటమి... కలవరపెడుతున్న ఓటమి

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు జట్టు కట్టాయి. మహాకూటమిగా ఏర్పడ్డాయి. నేతలు క్రమంగా జోరు పెంచుతున్నారు. వ్యూహాలు రచిస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా ఒక్క ప్రశ్న మాత్రం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో భాజపాను కూటమి ఓడిస్తుందా అన్న దానికంటే ఆ ప్రశ్నే ఎక్కువ ఉత్కంఠ కలిగిస్తోంది. కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరన్నదే ఆ ప్రశ్న. ఎందరో సీనియర్​ నేతలు, ముఖ్యమంత్రులు కూటమిలో ఉండడమే ఇందుకు కారణం. ఇదే అంశంపై భాజపా నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది కూటమి. ప్రధాని అభ్యర్థిత్వానికి కూటమిలో ఉన్న ప్రధాన నాయకుల సామర్థ్యమేంటి...? అనుకూలతలేంటి..? ప్రతికూలతలేంటి..?

రాహుల్​కు కష్టమే!

ప్రతిపక్షాల కూటమిలో జాతీయ పార్టీ కాంగ్రెస్​. ప్రధాన పక్షమూ అదే. ఆ పార్టీకి దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉనికి ఉంది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్​ గాంధీయే తదుపరి ప్రధాని అని ఆశలు పెట్టుకున్నారు కొందరు కాంగ్రెస్​ నేతలు.

కొంతకాలంగా పదునైన విమర్శలతో మోదీ ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నారు రాహుల్​. ఆసక్తికర ప్రసంగాలూ చేస్తున్నారు. ప్రచార ఊపు పెంచారు. ఇవన్నీ రాహుల్​కు కలిసొచ్చేవి. అయితే ఇవి ప్రధాని అభ్యర్థిత్వానికి సరిపోతాయా అనేదే సందేహం.

రాహుల్​గాంధీ

అనుభవలేమి రాహుల్​కు పెద్ద ప్రతికూలత. గతేడాది జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల దక్కిన విజయం మినహా గత ఐదేళ్లలో రాహుల్​ నేతృత్వంలో చెప్పుకోదగ్గ అద్భుతాలేవీ జరగలేదు.

2009లో రాహుల్​ నేరుగా ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. అయినా కాంగ్రెస్​ వద్దనుకుంది. అదే ఇప్పుడు ఇబ్బందిగా మారింది. ఇప్పడు ఆ పరిస్థితి లేదు. రాహుల్​ను ప్రధానిగా అభ్యర్థిగా ప్రకటిస్తే కూటమిలో చీలికలు రావచ్చనే భయాలు ఉన్నాయి. అందుకే కాంగ్రెస్​ తొందరపడడం లేదు. రాహుల్​ కూడా ఈసారికి పదవిపై తనకు ఆశలేదన్నట్టే మాట్లాడుతున్నారు. స్టాలిన్​ లాంటి కొందరు నేతలు మాత్రమే రాహుల్​ పేరును ప్రతిపాదిస్తున్నారు.

ధైర్యశాలి మమత.. అందరూ అంగీకరిస్తారా...?

మమతా బెనర్జీ.. పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి. ఆ రాష్ట్రంలో తిరుగులేని నేత. మోదీని నేరుగా ఢీకొనే సత్తా ఆమె సొంతం. ఇటీవలే సీబీఐ దాడులకు వ్యతిరేకంగా సత్యాగ్రహంతో కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. మమతకు జాతీయస్థాయిలోనూ మంచి గుర్తింపు ఉంది. ధైర్యశాలిగా అందరూ కొనియాడతారు. ఏపీ సీఎం సహా మరికొందరి మద్దతు ఉంది. అంతా బాగానే ఉన్నా ఇతర రాష్ట్రాల్లో అమె ప్రభావం ఎంత ఉంటుందన్నది సందేహమే. దక్షిణాది రాష్ట్రాల్లో ఆమె ప్రభావం అతి తక్కువ. తృణమూల్​ కాంగ్రెస్​కు బంగాల్​లో మాత్రమే ప్రాబల్యం ఉంది. వామపక్షాలు ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే అవకాశం లేకపోలేదు.

చంద్రబాబు అంగీకరిస్తే..

చంద్రబాబు నాయుడు

ప్రధాని అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు వినిపిస్తున్నా... ఆయన ముందు నుంచి ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు సంకేతాలివ్వడం లేదు. ఏపీయే తన తొలి ప్రాధాన్యమని చెబుతూ వస్తున్నారు. ఒకవేళ ఆయన ప్రధాని అభ్యర్థిత్వంపై ఆలోచిస్తే... 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఆయనకు అతిపెద్ద అనుకూలత. అన్ని పార్టీల నేతలను కలుపుకొని పోవడం, దాదాపు సీనియర్​ నేతలందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉండడం చంద్రబాబుకు కలిసివస్తుంది.

ఆంధ్రప్రదేశ్​లో చంద్రబాబు నేతృత్వంలోని తెదేపా అధికారంలో ఉంది. ఏపీలో ఎలాంటి ఇబ్బందిలేదు. తెలంగాణతో పాటు తెలుగు వారు ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఒడిశా వంటి తదితర రాష్ట్రాల్లో కచ్చితంగా చంద్రబాబు ప్రభావం ఉంటుంది. వాజ్​పేయీ హయాంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తప్పిన అనుభవం ఆయన సొంతం. ఇప్పుడు కూడా కూటమిలో ప్రధాన నేతగా వ్యవహరిస్తున్నారు.

ఏపీలో ఉన్నది 25 లోక్​సభ స్థానాలే. తెదేపా ఎన్ని గెలుస్తుందని ఇప్పుడే చెప్పలేకపోయినా.... దేశవ్యాప్తంగా చంద్రబాబు ప్రభావం అనేక రాష్ట్రాల్లో ఉంటుంది. కూటమిలోని పార్టీలు ఐక్యంగా ఉండేందుకు ఆయన అవసరం. అంకెల పరంగా కాకుండా నాయకత్వం పరంగా చూస్తే చంద్రబాబు సమర్థుడు. ఆయన పేరును ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదిస్తే దాదాపు చాలా మంది నేతల నుంచి సానుకూల అభిప్రాయమే వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు మాత్రం ఆ దిశగా ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు.

రాహుల్​ కాకపోతే ఖర్గే...

ప్రధాని అభ్యర్థి రేసులో మల్లికార్జున్​ ఖర్గే పేరు వినిపించడం ఆశ్చర్యకరమే. కానీ... ప్రధాని అభ్యర్థిగా రాహుల్​ గాంధీని కూటమి అభ్యర్థులు అంగీకరించకపోతే... ఖర్గేను రంగంలోకి దించాలని కాంగ్రెస్​ యోచిస్తోందనే విశ్లేషణలున్నాయి. కాంగ్రెస్​కు, గాంధీ కుటుంబానికి ఖర్గే విధేయుడు. అందరికీ ఆమోదయోగ్యమైన నేత. అందుకే ఖర్గే మరో మన్మోహన్​గా కాబోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఆయనకు సొంత ఇమేజీ చాలా తక్కువ. కూటమి సభ్యుల మధ్య ఏకాభిప్రాయం రాకపోతేనే ఖర్గే పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

ప్రియాంక చరిష్మా సరిపోతుందా..?

ప్రియాంకగాంధీ

ప్రధాని అభ్యర్థిత్వానికి మమతా బెనర్జీ పేరు బలంగా వినిపిస్తున్న సమయంలో ప్రియాంక గాంధీని క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్​. ఆమెకు రాజకీయ అనుభవలేమి ప్రధాన ప్రతికూలత. భర్త రాబర్ట్​ వాద్రా కేసుల్లో చిక్కుకోవడమూ ప్రియాంకకు కలిసిరాని అంశం. ఇంతమంది సీనియర్​ నాయకులుండగా ప్రియాంకను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే చాలా మంది వ్యతిరేకించే అవకాశమే ఎక్కువ.

తెరపైకి ఫరూక్​ అబ్దుల్లా

హిందుత్వ పార్టీగా ముద్రపడిన భాజపాను ఇరుకున పెట్టేందుకు ముస్లిం నేత, కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్​ కాన్ఫరెన్స్​ అధ్యక్షుడు ఫరూక్​ అబ్దుల్లాను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్నది కొందరి వాదన. దేశంతో తొలిసారి ముస్లిం మైనార్టీని ప్రధాని పీఠంపై కూర్చొబెట్టాలన్నది వారి ఆలోచన. అయితే ఫరూక్​ అబ్దుల్లా ప్రభావం ఇతర రాష్ట్రాలపై చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. కూటమి హిందువులకు వ్యతిరేకం అని భాజపా ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. ప్రధాని అభ్యర్థిగా ఫరూక్​ అబ్దుల్లాను ప్రకటించడం దాదాపు కష్టమే అని చెప్పవచ్చు. ఆఖరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.

కూటమిలో లేకపోయినా...

బహుజన్​ సమాజ్​ పార్టీ ప్రస్తుతానికైతే ప్రతిపక్షాల కూటమికి దూరంగా ఉంది. విపక్షాల జట్టులోకి వచ్చేది.. లేనిది ఇంకా స్పష్టతరాలేదు. ఆ పార్టీ నేతలూ మౌనం వహిస్తున్నారు. ఒకవేళ బీఎస్పీ కూటమిలో చేరితే దళితనేత మాయావతి పేరూ ప్రధాని అభ్యర్థిగా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. సమాజ్​వాదీ పార్టీ సైతం ఇందుకు మద్దతిచ్చే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్​లో మాత్రం ఎస్పీ, బీఎస్పీ వేరే కూటమిగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్​ను దూరం పెట్టాయి. కూటమిలోకి రావడం సందిగ్ధమే.

కూటమిలోని పార్టీలన్నీ ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని ముక్తకంఠంతో చెబుతున్నాయి. అయినా రాజకీయ సమీకరణాలు మారి, భాజపాను ఇరుకునపెట్టేందుకు ప్రధాని అభ్యర్థిని ఎన్నిక ముందే ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిర్ణయమేదైనా కూటమిలో చీలిక రాకుండా చూసుకోవడమే నేతల ముందున్న అతిపెద్ద సవాలు.

ABOUT THE AUTHOR

...view details