ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 10, 2019, 8:33 PM IST

ETV Bharat / briefs

"కోటాపై అనుసరించిన విధివిధానాల వెల్లడి కుదరదు"

అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ అనుసరించిన విధానం, పీఎంవో సంప్రదింపుల రికార్డులను సమాచార హక్కు చట్టం ద్వారా బహిర్గత పరచలేమని కేంద్రం స్పష్టం చేసింది.

రిజర్వేషన్లు

ఉన్నత కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గం తీసుకున్న విధానపరమైన నిర్ణయ వివరాలు వెల్లడించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ విషయంలో మంత్రివర్గ చర్చలు, వాటి రికార్డులు, పత్రాలు సమాచార హక్కు చట్టం ద్వారా బహిర్గతం చేయడానికి వీలు పడదని స్పష్టం చేసింది.

'ఈడబ్ల్యూఎస్​' వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన కేబినెట్​ నోట్​, పీఎంవోతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలు కోరుతూ ఎన్జీవో వెంకటేశ్​ నాయక్​ ఆర్​టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆర్​టీఐ చట్టం సెక్షన్​ 8 (1)(ఐ) ప్రకారం ఈ వివరాలు వెల్లడించడానికి వీలు పడదని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

దీనిపై స్పందించిన నాయక్​, కేంద్ర సమాచార కమిషన్​ ఆదేశాల ప్రకారం, ప్రభుత్వం అమలు చేస్తోన్న చట్టాల వివరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 'ఈడబ్ల్యూఎస్' రిజర్వేషన్ల చట్టం వివరాలు సంబంధిత మంత్రిత్వశాఖ వెబ్​సైట్లో ప్రచురించలేదన్నారు. అందుకే ఆర్​టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నానని నాయక్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తిరస్కరణకు వ్యతిరేకంగా తాను పోరాడతానని నాయక్ స్పష్టం చేశారు.

ఉన్నత వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం 2019, ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. ఫలితంగా వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూరనుంది.

ABOUT THE AUTHOR

...view details