ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కోటా కోసం గుజ్జర్ల పోరు

విద్యా, ఉద్యోగ రంగాల్లో ఐదు శాతం కోటా కల్పించాలని రాజస్థాన్​లో గుజ్జర్లు చేపట్టిన ఆందోళనలు ఐదో రోజుకు చేరుకున్నాయి.

గుజ్జర్ల పోరు

By

Published : Feb 12, 2019, 2:46 PM IST

రిజర్వేషన్ల కోసం రాజస్థాన్​ సవాయ్​ మాధోపూర్​ జిల్లాలో రైలు పట్టాలపై గుజ్జర్లు చేపడుతోన్న ఆందోళన ఐదో రోజుకు చేరుకొంది. ఫలితంగా ఉత్తర రైల్వే పరిధిలో మూడు రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. మరో రెండు రైళ్లను దారి మళ్లించింది.

నిరసనలు వ్యాప్తి కాకుండా మాధోపూర్ జిల్లాలో అంతర్జాల సేవలను నిలిపివేశారు. అయితే డిమాండ్​లు సాధించకుండా వెనుదిరిగేది లేదని గుజ్జర్లు స్పష్టం చేశారు. గుజ్జర్ల ఆందోళనలకు మరో నాలుగు సామాజిక వర్గాలు మద్దతు ప్రకటించాయి. నిరసనల్లో వారూ పాల్గొన్నారు.

రైళ్ల రాకపోకలపై ప్రభావం

ఆందోళనలతో దేశవ్యాప్తంగా మొత్తం 250కిపైగా రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. ఫిబ్రవరి 10 నుంచి 13 వరకు ఉత్తర రైల్వే పరిధిలో 73 రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఎన్నికల హామీ నెరవేర్చాలి: బైంస్లా

"ఇటీవల అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గుజ్జర్ల వర్గానికి 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సవాయ్‌ మాధో‌పూర్‌ జిల్లాలో రైలురోకో ప్రారంభించాం."
- కిరోరి బైంస్లా, గుజ్జర్‌ సామాజిక వర్గం నాయకుడు

కేంద్రాన్ని అడగండి: గహ్లోత్​

కోటా అమలుకు రాజ్యాంగ సవరణ చేయాలని, అందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కలవాలని నిరసకారులకు రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్​ సూచించారు. బైంస్లాతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. పట్టాలపై సమస్యలు పరిష్కారం కావనీ, హామీకి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర మంత్రి విశ్వేంద్రసింగ్ ప్రకటించారు.

ఎన్నికల్లో హామీలు... అనంతరం తంటాలు

ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు గుప్పించటం.. అమలు విషయంలో సవాళ్లను ఎదుర్కోవటంలో విఫలమవుతున్నాయి ప్రభుత్వాలు. ఓవైపు రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దనే సుప్రీం ఆదేశాలు, మరోవైపు మతపరమైన కోటాను వ్యతిరేకించే బీజేపీ అధికారంలో ఉండటం ఆందోళనలకు మరింత ఊతమిస్తోంది.

తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ అమలు చేయటానికి గతంలో కేంద్రం ఆమోదముద్ర వేసింది. అదే తరహాలో ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం అగ్రవర్ణాలకు పదిశాతం కోటా కల్పిస్తూ చట్టాన్ని తీసుకురావటంతో రిజర్వేషన్ల ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. కోటాకు పార్లమెంటు ఆమోదం పొందిన నెల రోజుల వ్యవధిలోనే గుజ్జర్లు ఆందోళనలకు దిగడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details