రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్‌తో నెట్టుకొస్తున్న విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానని కాబోయే ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఏపీ భవన్లో విలేకర్లతో సమావేశం నిర్వహించారు. ప్రధానితో భేటీ సందర్భంగా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, సమస్యలను వివరించానన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, ఆర్థిక సాయం కావాలని కోరానన్నారు. రాష్ట్రం విడిపోయే నాటికి 97 వేల కోట్ల అప్పులుంటే.. చంద్రబాబు ఐదేళ్ల పాలన తర్వాత అవి 2.5 లక్షల కోట్లకు చేరాయని విమర్శించారు. కేంద్రంపై ఇంతగా ఆధారపడాల్సిన పరిస్థితులు మరెప్పుడూ ఉండేవి కావేమోనని అన్నారు. రాష్ట్రాన్ని బాగా నడపాలనే తపన తనకు ఉందనీ.. అయితే చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయనీ.. విభజన హామీల అమలు కోసం కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తెస్తామని స్పష్టంచేశారు. 2024 నాటికి మద్యాన్ని ఐదు నక్షత్రాల హోటళ్లకు పరిమితం చేశాకే ఓట్లు అడుగుతాననీ.. ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లకుండా పనులు చేస్తానని వివరించారు.
రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత అవసరం
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయనీ.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పరిష్కరించుకోవడం ముఖ్యమని తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నెరపడం చాలా అవసరమనీ... ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతిస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.