గుజ్జర్ల రిజర్వేషన్లకు రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదం గుజ్జర్లతో పాటు మరో నాలుగు కులాలకు రాష్ట్ర విద్య, ఉద్యోగాల్లో అదనంగా 5 శాతం కోటా కల్పించే బిల్లుకు రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
గుజ్జర్ల రిజర్వేషన్లపై ఇటీవల రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 'రాజస్థాన్ వెనుకబడిన తరగతుల సవరణ బిల్లు-2019'ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు విద్యుత్ శాఖ మంత్రి బీడీ కల్లా.
రాష్ట్రంలోని 5 కులాలు అత్యంత వెనకబడిన వర్గాలుగా ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్ అవసరమని ప్రభుత్వం పేర్కొంది.
ఈ బిల్లు ఆమోదంతో రాష్ట్రంలోని గుజ్జర్లు, బంజరా, గడియా లోహర్, రాయికస్, గదారియాలకు ప్రస్తుతం అందుతున్న రిజర్వేషన్లు 21 శాతం నుంచి 26 శాతానికి పెరిగాయి.
గుజ్జర్ల నిరసనలు
విద్య, ఉద్యోగాల్లో మరో 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గుజ్జర్లు దిల్లీ-ముంబయి రైల్వే ట్రాక్‌పై బైఠాయించి నిరసనలు చేపట్టారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చి తీరాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వారిని శాంతింపజేయడానికి ప్రభుత్వం ఓబీసీ సవరణ బిల్లు-2019ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.