కాటన్ బ్యారేజ్ నుంచి డెల్టా కాల్వలకు నీటి విడుదల
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాలకు అధికారులు నీరు విడుదల చేశారు. ఈ నీటిని వరి, ఇతర పంటల కోసం 11 లక్షల మంది రైతులు వినియోగించుకోనున్నారు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి గోదావరి డెల్టా కాల్వలకు నీరు విడుదలయ్యింది. విజ్జేశ్వరం ఆర్మ్ నుంచి పశ్చిమ డెల్టాకు, మద్దూరు ఆర్మ్ నుంచి మధ్య డెల్టాకు, ధవళేశ్వరం ఆర్మ్ నుంచి తూర్పు డెల్టాకు నీరు విడుదల చేశారు. ఆయా ఆర్మ్ల వద్ద పూజలు చేసి గోదావరి డెల్టా సీఈ కృష్ణారావు ఐదు వందల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాల్లో 10 లక్షల 16 వేల ఎకరాలకు నీటి విడుదల ప్రారంభమయ్యింది. ఉభయ గోదావరి జిల్లాలో 11 లక్షల మంది రైతులు ఈ నీటిని వరి, ఇతర పంటలకు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం మొదటి ప్రాధాన్యంగా మంచి నీటి చెరువులకు నీటిని వదులుతున్నామని జలవనరుల శాఖ సీఈ కృష్ణారావు తెలిపారు.