ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రైతులకు బేడీలు... ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు - అమరావతి రైతులు అరెస్టు వార్తలు

ఇటీవల అరెస్టైన అమరావతిలోని కృష్ణాయపాలెంకు చెందిన రైతులకు సంకెళ్లు వేసి గుంటూరు జిల్లా జైలుకు తీసుకురావటం విమర్శలకు దారి తీసింది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారి మాదిరి రైతుకు బేడీలు వేయటంపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా బేడీలు వేస్తారా అని ప్రశ్నించారు.

amaravati farmers
amaravati farmers

By

Published : Oct 27, 2020, 3:21 PM IST

Updated : Oct 28, 2020, 9:14 AM IST

ఈ నెల 24వ తేదీన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంకు చెందిన 11మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొవిడ్ పరీక్షల అనంతరం వారిలో ఏడుగురిని మంగళవారం నరసరావుపేట జైలు నుంచి ఆర్టీసీ బస్సులో గుంటూరు జిల్లా జైలుకు తీసుకువచ్చారు. అయితే రైతుల చేతులకు బేడీలు వేసి తీసుకురావడం విమర్శలకు దారితీసింది. ఇద్దరు రైతులకు కలిపి బేడీలు వేసిన పోలీసులు... జైలు లోపలికి వెళ్లే సమయంలో తొలగించారు. సాధారణంగా తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి సంకెళ్లు వేస్తారు. రాజధాని పరిధిలో జరిగింది చిన్నపాటి గొడవే. ఆ గొడవపైన రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు బేడీలు వేయటంతో పోలీసులపై విమర్శలు వస్తున్నాయి.

సంకెళ్లతో జిల్లా జైలుకు కృష్ణాయపాలెం రైతులు

ఇదేనా రైతు రాజ్యం?

మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం రైతులకు బేడీలు వేయడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా బేడీలు వేస్తారా అని ప్రశ్నించారు. రైతులపై అట్రాసిటీ కేసు పెట్టడం సరికాదన్న ఆయన... మానవహక్కుల ఉల్లంఘనకు సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సీఎం చెబుతున్న రైతురాజ్యం అంటే ఇదేనా అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఆటో ఆర్టిస్టులను అడ్డుకున్నందుకే తప్పుడు కేసులు పెట్టాలనేంత కోపమొస్తే... భూములు త్యాగం చేసినవాళ్లనూ, అమరావతినీ చంపేస్తుంటే రైతులకు ఇంకెంత కోపం రావాలని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయకుంటే... న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తామన్నారు.

ఆ పని చేసిన తొలి ప్రభుత్వం వైకాపానే

రైతులకు సంకెళ్లు వేయడాన్ని చూసి.... సభ్యసమాజం తలదించుకుంటోందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. రైతులను నేరస్థులుగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని మండిపడ్డారు. రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై న్యాయపోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు. ఎస్సీలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన తొలి ప్రభుత్వంగా వైకాపా సర్కార్ నిలిచిపోతుందని హైకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి... ఉద్యమంపై ఉక్కుపాదం మోపడం మానుకోవాలని రాజధాని పరిరక్షణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ అన్నారు.

సంకెళ్లతో జిల్లా జైలుకు కృష్ణాయపాలెం రైతులు

అరెస్ట్ ఎందుకు చేశారు?

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ రైతులు 300రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్నారు. అయితే మూడు రాజధానులకు మద్దతుగా ఇటీవల మందడం వద్ద సీడ్ యాక్సిస్ రోడ్డులో కొందరు దీక్షలు చేపట్టారు. అందులో పాల్గొనేందుకు ఈ నెల 23వ తేదీన మంగళగిరి మండలం కృష్ణాయపాలెం నుంచి కొందరు ఆటోల్లో వెళ్తుండగా... కృష్ణాయపాలెం రైతులు, దళితులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది.

తమను అడ్డుకోవటంపై కృష్ణాయపాలెంకు చెందిన ఈపూరి రవి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో అరెస్టయిన వారిలో 9మంది ఎస్సీ, ఎస్టీలే ఉండగా... ఇద్దరు మాత్రమే బీసీలు ఉన్నారు. ఆ విషయం తెలిసిన రవి... తన ఫిర్యాదు వెనక్కు తీసుకుంటున్నట్లు పోలీసులకు లేఖ ఇచ్చారు. అయితే ఎఫ్​ఐఆర్ నమోదు చేసినందున ఇపుడు కేసు వెనక్కి తీసుకోవడం కుదరదని పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి :

నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం

Last Updated : Oct 28, 2020, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details