చరిత్ర ఎరుగని విలయం.. ఊహలకందని ఉత్పాతం.. ఉప్పెనలా ముంచుకొచ్చిన జలప్రళయం.. గత ఏడాది కేరళను అతలాకుతలం చేసింది. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఆ విషాదం నుంచి కోలుకునేందుకు.. దైవభూమికి చాలా కాలమే పట్టింది. ఇప్పటికీ.. గత ఏడాది మిగిల్చిన వరదల విధ్వంసం తాలూకు గుర్తులు చెరిగిపోలేదు. అలప్పుజా, ఎర్ణాకుళం లాంటి జిల్లాలు నాటి గాయం పూర్తిగా నుంచి కోలుకోలేదు. ఇలాంటి చోట.. బాధితులకు చీకటిలో వెలుగురేఖలా కొన్ని స్వచ్ఛంద సంస్థలు అండగా నిలిచాయి. బాధితులకు కనీస అవసరాలు తీర్చడమే కాక.. గూడు కోల్పోయిన వారినీ అక్కున చేర్చుకున్నాయి. ఉచితంగా ఇళ్లు కట్టించి.. బతుకుపై భరోసా కల్పించాయి. అందులో.. ఈనాడు సంస్థలు నిర్వహిస్తున్న రామోజీ గ్రూపు ముందు వరుసలో నిలిచింది.
మళ్లీ వరదలు వచ్చినా ఇబ్బంది రాకుండా...
గత ఏడాది వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారికి ఈనాడు - రామోజీ సంస్థలు సహాయం చేసి ఆదుకున్నాయి. మరోసారి పెద్ద ఎత్తున వరదలు వచ్చినా బాధితులకు ఇబ్బంది కాకుండా రామోజీ గ్రూపు ప్రతినిధులు జాగ్రత్తలు తీసుకున్నారు. భూమికి ఒకటిన్నర మీటరు ఎత్తులో ఇంటిని నిర్మించేలా ఇంజినీర్లు రూపకల్పన చేశారు. ఆ మేరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఇప్పుడు మళ్లీ వర్షాకాలం వచ్చింది. నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా వచ్చినా.. కేరళలో ఎప్పటిలాగే భారీ వర్షాలు మొదలయ్యాయి. అలప్పుజ జిల్లాలోనూ వానలు జోరందుకున్నాయి. అయినా.. రామోజీ గ్రూపు కట్టించిన ఇళ్లలో లబ్ధిదారులు నిశ్చింతగా ఉంటున్నారు. రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వానల నుంచి ఎలాంటి ముంపు సమస్య లేకుండా జీవిస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి ముందే.. అన్ని జాగ్రత్తలు తీసుకుని.. పక్కా ప్రణాళికను అమలు చేశామని ప్రాజెక్టును ముందుండి నడిపించిన ఐఏఎస్ అధికారి వీఆర్ కృష్ణతేజ చెప్పారు. ఆ ఫలితం.. ఇప్పుడు కనిపిస్తోందన్నారు.