తెదేపా నేతలపై ఐటీ అధికారుల దాడులను.. అధినేత చంద్రబాబు ఖండించారు. ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా పనే అని ఆరోపించారు. మోదీ లాంటి నీఛమైన ప్రధానిని తాను ఇప్పటివరకూ చూడలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని సీఎం మండిపడ్డారు.రాష్ట్రాన్ని మరోసారి ఎడారి చేయటానికి కుట్రలు పన్నుతున్నారన్నారు.
రేపు రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కాగడాల ప్రదర్శనలు
ఉగాది పర్వదినాన రేపు మేనిఫెస్టో విడుదల చేసుకుంటున్నామని...పౌరుషానికి ప్రతీకగా రేపు సాయంత్రం కాగడాల ప్రదర్శన చేపడుతున్నామనీ చంద్రబాబు తెలిపారు. ఎలాంటి కుట్రలనైనా ఎదుర్కొంటామన్న స్ఫూర్తితో కాగడాల ప్రదర్శనలు సాగాలని పిలుపునిచ్చారు.తెలుగుజాతి కీర్తిని చాటుతూ గట్టిగా పోరాడతామని ఈ కాగడాల ర్యాలీలు చేపట్టాలన్నారు.ఈ నెల7న అన్నిచోట్ల ప్రార్థనలు,పూజలు నిర్వహించాలని పార్టీ నేతలతో సీఎం అన్నారు.కుట్రలపై సర్వమతాలు మనకు అండగా నిలుస్తున్నాయన్నారు.ఈ నెల8, 9న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి పౌరుషాన్ని రగిల్చాలని సీఎం పార్టీ నేతలకు సూచించారు.రాష్ట్రం కోసం పోరాడాలి,ఎన్నికల యుద్ధంలో గెలవాలనే స్ఫూర్తిని నింపాలన్నారు.దేనికీ భయపడాల్సిన పనిలేదు..విజయం పట్ల పూర్తి స్పష్టతతో ఉన్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
వైకాపా వైఖరి చూస్తే అసహ్యం వేస్తోంది..
నిన్న టీవీలో కొన్ని సంఘటనలు చూస్తే అసహ్యం వేసిందని అన్నారు.వ్యక్తిగత జీవితాలను దిగజార్చుకుంటూ దరిద్రమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.క్యారెక్టర్ లేని వారంతా వైకాపాలోనే ఉన్నారన్నారు.అరాచకశక్తిగా మారిన వైకాపాను ఎదుర్కొంటూనే ప్రజల్లో చైతన్యం కలిగించాలని తెలిపారు.వైకాపా నేతల అక్రమాలు,దౌర్జన్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సీఎం పిలుపునిచ్చారు.