ముఖ్యమంత్రికి తమ సమస్యలు చెప్పుకుని వాటి పరిష్కారంపై హామీ తీసుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లి.. సీఎం జగన్ నివాసానికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఉదయాన్నే వినతులు స్వీకరిస్తున్నారని తెలిసి అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి తరలివస్తున్నారు. సీఎం జగన్ను కలిసేందుకు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, ఉద్యోగులతో సహా వైకాపా కార్యకర్తలు ఆయన నివాసానికి వస్తున్నారు. ఇలా వచ్చే వారితో సీఎం నివాసం రద్దీగా మారుతోంది.
బాధితులు తమ సమస్యలను విన్నవించుకునేందుకు సీఎం నివాసం వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నారు. సీఎంను కలిసేందుకు తమకు అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం వారి వినతులు తీసుకుని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారి వినతులను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. రోజుకు 4 విడతలుగా బయటకు వచ్చి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.