'పసుపు సైనికులే...తెదేపా విజయ రహస్యం' - తెదేపా ఎన్నికల సన్నాహక సభ
రౌడీయిజం చేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ హత్యా రాజకీయాలు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలే మరోసారి అధికారం అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలులో జరిగిన ఎన్నికల సన్నాహక సభలో సీఎం శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చంద్రబాబు కర్నూలులో పర్యటించారు. ఎస్టీబీసీ కళాశాలలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. 65 లక్షల మంది పసుపు సైనికులే తెదేపా విజయ రహస్యమని తెలిపారు. బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి బలమని గుర్తుచేశారు. మెజారిటీ ఓట్లు సాధించిన నాయకులందరికీ పార్టీలో సముచిత స్థానముంటుందన్న సీఎం.. పని చేయని నేతలను పట్టించుకునేది లేదని తేల్చిచెప్పారు.
శ్రీశైలం సిట్టింగ్ ఎమ్మెల్యే బుడ్డారాజశేఖర్ రెడ్డినే ఈసారీ పోటీ చేయాలని సీఎం ఒప్పించారు. అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని రాజశేఖర్‌కు సీఎం ధైర్యం చెప్పారు.
జిల్లాల వారీగా ఎన్నికల సన్నాహక సభలు నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు ప్రచార హోరు పెంచారు. ఒకే రోజు రెండు మూడు జిల్లాల్లో పర్యటిస్తూ, ప్రచారరథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.