ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసనలు రెండో రోజు కొనసాగాయి. పౌరసత్వ చట్టసవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అసోంలోని గువహటి విశ్వవిద్యాలయ విద్యార్థులు నల్లజెండాలతో ఆందోళన చేపట్టారు.
రెండు రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటన నిమిత్తం నిన్న అసోం రాజధాని గువహటికి చేరుకున్న మోదీకి నిరసనలతో స్వాగతం పలికింది అసోం విద్యార్థి సంఘం. 'మోదీ గో బ్యాక్' అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.
ఈ ఉదయం గువహటి నుంచి అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ బయల్దేరుతున్న సమయంలోనూ మరోసారి మోదీకి నిరసన ఎదురైంది. ఆందోళనకారులు నల్లజెండాలు ఊపుతూ పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇంతకీ ఏంటీ 'పౌరసత్వ బిల్లు'..?
పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ద్వారా బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చి ఆరు సంవత్సరాలపాటు భారత దేశంలో నివసించిన హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధమతస్థులు, పార్శీలకు ఎటువంటి పత్రాలు లేకపోయినా భారత పౌరసత్వం కల్పిస్తారు.
గత లోక్సభ శీతాకాల సమావేశాల్లో జనవరి 8న ఆమోదం పొందిన ఈ పౌరసత్వ బిల్లు ప్రస్తుతం రాజ్యసభ ఆమోదానికి వేచి ఉంది.