పోలీసు ఉన్నతాధికారుల వ్యవహారంలో.. ఎన్నికల సంఘం ఆదేశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఇది.. ప్రతిపక్ష వైకాపా, కేంద్రం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి చేసిన కుట్ర అని కర్నూలులో ఆరోపించారు. పద్ధతి ప్రకారం అధికారులను బదిలీ చేయాల్సిందిపోయి.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహించారు. వైకాపా నాయకుడు విజయసాయిరెడ్డి ఆర్థిక నేరస్థుడని.. ఆయన ఇచ్చిన పిటిషన్ ఆధారంగా బదిలీ నిర్ణయం తీసుకోవడం తప్పని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ అని గుర్తు చేసిన ముఖ్యమంత్రి.. అధికారాలను సక్రమంగా ఉపయోగిస్తే అభ్యంతరం లేదని చెప్పారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని.. తమను ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తామన్నారు. మా ఫిర్యాదును మాత్రం పట్టించుకోరు!
వైకాపా నేతలు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోపే పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేశారని ఆరోపించిన సీఎం... తాము మాత్రం దిల్లీ వెళ్లి ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటివరకూ ఈసీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. రాష్ట్ర పోలీసులను నమ్మేది లేదని వైకాపా వాళ్లు చెప్పగానే చర్యలు తీసుకోవడం ఏంటన్నారు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు తొలగించిన వాళ్లు.. రాష్ట్రంలోనూ 9 లక్షల ఓట్లు తొలగించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు ఇచ్చినవాళ్లలో 85 శాతం మంది వైకాపా వాళ్లే ఉన్నారని చంద్రబాబు చెప్పారు. కుట్రలు చేసి అడ్డంగా దొరికిపోయిన ఇలాంటి వారిపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
ఈసీ జోక్యం ఎందుకు?
తనకు జడ్ ప్లస్ భద్రత ఉన్న విషయాన్ని, గతంలో తనపై హత్యాయత్నం జరిగిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. డీజీ, ఇంటెలిజెన్స్ సిబ్బంది తన భద్రతను పర్యవేక్షిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. అయినా.. పోలీసు ఉన్నతాధికారుల విషయంలో ఈసీ ఎందుకు జోక్యం చేసుకుందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ భాజపా భ్రష్టు పట్టించిందన్న సీఎం.. కేంద్రం చెప్పినట్టుగా వ్యవహరించి ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవద్దని ఈసీకి సూచించారు.