ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ప్రేమ నుంచి పెళ్లి వరకు.. - రణ్​వీర్ దీపికా పదుకొనే

ప్రేమించడం గొప్ప విషయం కాదు. దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లడం గొప్ప. అలాంటి సెలబ్రిటీ జంటలు ఇవే.

By

Published : Feb 14, 2019, 4:32 PM IST

ప్రేమకు పేద, ధనిక అన్న భేదం లేదు. స్వచ్ఛమైన మనసుంటే చాలు దీనికి అందరూ అర్హులే. ఈ మధ్య సినిమా రంగంలోనూ, క్రీడా రంగంలో స్నేహితులు కాస్త ప్రేమికులుగా మారుతున్నారు. ప్రేమను పెళ్లి పీటలెక్కిస్తున్నారు. గతేడాది పెళ్లి చేసుకున్న అలాంటి చూడముచ్చటైన జంటలివే.

రణ్​వీర్ సింగ్-దీపికా పదుకుణె..

ఈ బాలీవుడ్ జంటపై పెళ్లికి ముందే ఎన్నో పుకార్లు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ గతేడాది నవంబరు14న ఇటలీలో అంగరంగవైభవంగా పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందు వీరిద్దరూ ఆరేళ్ల పాటు డేటింగ్ చేశారు. పెళ్లి తర్వాత ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు.

ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్

ఈ పెళ్లి నిజంగా ఓ సంచలనమే. ఎందుకంటే ప్రియాంకను వివాహం చేసుకున్న నిక్.. అమెరికాకు చెందిన గాయకుడు, నటుడు కావడం. మెసేజ్​లు పంపుకోవడం నుంచి మూడు ముళ్లు వేసేదాకా వీరి ప్రేమాయణం సాగింది. రాజస్థాన్ జోధ్​పూర్​లో గతేడాది డిసెంబరు1న వీరు వివాహం చేసుకున్నారు.

సైనా నెహ్వాల్- కశ్యప్

షటిల్ కోర్టులో మొదలైన వీరి ప్రేమ... పెళ్లి మండపం వరకు వెళ్లింది. డిసెంబరు 17న హైదరాబాద్​లో వీరి వివాహం జరిగింది. గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నప్పుడే వీరిద్దరూ ప్రేమించుకున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా, పురుషులు సింగిల్స్ విభాగంలో కశ్యప్ ఆకట్టుకుంటున్నారు.

శ్రియ శరణ్-అండ్రూ కోశ్చివ్

రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, యువ పారిశ్రామిక వేత్త ఆండ్రూ కోశ్చివ్​ను శ్రియ పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ చాలా కాలం నుంచే ప్రేమలో ఉన్నారు. గతేడాది మార్చి 12న వివాహం చేసుకున్నారు. తెలుగులో అగ్ర హీరోలందరితోనూ శ్రియ నటించింది.

మిలింద్ సోమన్- అంకితా కొన్వార్

మోడల్, నటుడు అయిన మిలింద్ మొదటిగా ఫ్రెంచ్ నటి మిల్నే జంపనోయిని 2006లో పెళ్లి చేసుకున్నాడు. 2008లో విడిపోయారు. 52 ఏళ్ల వయసులో అంకితా కొన్వార్​ను ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. 2018 ఏప్రిల్ 22న ఈ పెళ్లి జరిగింది. మిలింద్ సోమన్ ప్రసిద్ధి గాంచిన రన్నర్. ఇప్పటికే ఎన్నో పతకాలు సాధించాడు.

ఇలియానా-ఆండ్రూ నీబోన్

తెలుగు సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి ఇలియానా. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నీబోస్​తో ప్రేమలో ఉందనేందుకు ఆమె సామాజిక మాధ్యమాల్లో ఉంచిన ఫొటోలే సాక్ష్యం. ఆమెకు పెళ్లైందా లేదా అనేది మాత్రం ఇంకా సస్పెన్సే.

ABOUT THE AUTHOR

...view details