కార్టూన్లతో సందేశాలు...సామాజిక పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు వర్తమాన వ్యవహారాలే ఆయనకు ఆయుధాలు. కుంచె పట్టారంటే చాలు. ఎవరైనా సరే ఇట్టే ఆకర్షితులు అవుతారు. వృత్తిలో చదరంగ శిక్షకుడిగా రాణిస్తూనే.. ప్రవృత్తిలో కార్టూనిస్టుగా జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. ఆయనే.. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం దొంతికుర్రుకు చెందిన గుత్తుల శ్రీనివాసరావు. ఆయనకు.. చిన్నతనం నుంచే కార్టూన్లపై ఆసక్తి. ఇంటర్మీడియట్ నుంచి ఆ ఆసక్తి అభిరుచిగా మారింది.
ఆలోచన రేకెత్తిస్తాయి...
శ్రీనివాసరావు గీసిన కార్టూన్లు తెలుగు, మరాఠీ, హిందీ, ఆంగ్ల పత్రికల్లో ప్రచురితమయ్యాయి. స్మార్ట్ ఫోన్ మానవ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తోందన్న అంశాలపై ఆయన గీసిన కార్టూన్లు ఆలోచింపజేసేలా ఉంటాయి. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యం వివరిస్తూ గీసిన కార్టూన్ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది. ఇవే కాకుండా.. సహపంక్తి భోజనాలు, సీరియళ్ల ప్రభావం, ఎన్ఆర్ఐల తీరు, సాంకేతిక అనుబంధాలపై శ్రీనివాసరావు గీసిన కార్టూన్లు.. నవ్వు తెప్పిస్తూనే ఆలోచన రేకెత్తిస్తాయి.
జాతీయ స్థాయి గుర్తింపు
శ్రీనివాసరావు గీసిన కార్టూన్లకు చాలా స్థాయిలో జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. 2016 నుంచి 2019 వరకూ తలిశెట్టి రామారావు పేరిట నిర్వహించిన కార్టూన్ల పోటీల్లో వరుసగా నాలుగేళ్లు బహుమతులు అందుకున్నారు. 2017లో విశాఖ సంస్కృతి పత్రిక నిర్వహించిన పోటీల్లో సంస్కృతిపై నాటి, నేటి పరిస్థితుల మధ్య వ్యత్యాసం చూపిస్తూ గీసిన కార్టూన్ ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. 2018లో ఈటీవీ ఫ్లస్ జాతీయస్థాయిలో నిర్వహించిన కార్టూన్ పోటీల్లో గెలుపొందిన ముగ్గురు విజేతల్లో శ్రీనివాసరావు ఒకరు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కార్టూన్ ప్రదర్శన శాలలో కార్పొరేట్ వైద్యంపై శ్రీనివాసరావు గీసిన కార్టూన్‌కు విశిష్ట బహుమతి వచ్చింది.
ప్రపంచ తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో... ఒక స్మార్ట్‌ఫోన్ అమాన్యుడిని సైతం పిచ్చివానిగా మారుస్తుందన్న నేపథ్యంలో గీసిన వ్యంగ్య చిత్రానికి రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. కార్టూనిస్టుగా రాణిస్తున్న శ్రీనివాసరావు.. వృత్తిరీత్యా ముంబయిలో చదరంగ శిక్షకుడిగా పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి : ఆవు ఫుట్‌బాల్ ఆడింది...