21 కోట్ల నగదు... 12 కేజీల బంగారం స్వాధీనం - GOLD
సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గరవుతున్న వేళ... నగదు ప్రవాహంపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. 2014 ఎన్నికల్లో మొత్తం 9 కోట్ల రూపాయల నగదు సీజ్ చేస్తే.. ఈసారి అంతకంటే ఎక్కువ నగదు పంచే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అభిప్రాయపడ్డారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి ప్రతీ రోజూ కోట్ల రూపాయల్లో నగదు తరలింపు జరుగుతోందని.. ఎక్కడికక్కడ తనిఖీలు చేసి డబ్బును సీజ్ చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఎన్నికల్లో పంచేందుకు సిద్ధం చేసిన 21 కోట్ల రూపాయల నగదును పోలీసు తనిఖీల్లో పట్టుకున్నట్టు ఆయన వివరించారు. ఎన్నికల ప్రచారం ఊపందుకోకుండానే ఇప్పటికే 10 కోట్ల రూపాయల విలువైన మద్యం దొరికిందని చెప్పారు. 2014 ఎన్నికల్లో మొత్తం9 కోట్ల రూపాయల నగదును సీజ్ చేస్తే... ఈసారి అంతకంటే ఎక్కువే పంపకానికి సిద్ధం చేసినట్టు తెలుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది ఇదే సమయానికి ఎంత మద్యం విక్రయాలు జరిగాయన్న దానిపై ఆరా తీస్తున్నామని ద్వివేది తెలిపారు. పోలీసు తనిఖీల్లో 21 కోట్ల 64 లక్షల నగదుతో పాటు 12 కేజీల బంగారం, 61 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇవేకాక 3 వేల 214 లీటర్ల మద్యం, 33 కేజీల గంజాయి, పాన్ మసాలా, ఖైనీ ప్యాకెట్లను కూడా పట్టుకున్నట్లు తెలిపారు.