ఎండలు మండే సీజన్లో ఎలక్షన్ ముందుకొచ్చింది. ప్రచారం ఊపందుకోవడంతో అభ్యర్ఖులంతా రోడ్లపైనే ఉన్నారు. మండుతున్న ఎండలకు అల్లాడుతున్నారు. ఇప్పటికే కొందరు డీలా పడిపోయారు. ఇంకొందరు ఆస్పత్రుల పాలయ్యారు. కానీ ఆయన ఏ మాత్రం ఎండలను లెక్కచేయక.. పంచ్‌లు పేలుస్తూ..సూర్యుడితో సై అంటున్నారు... ఆయనే తెదేపా అధినేత.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.
మండేచంద్రుడు
చంద్రబాబు ఎలా శ్రమిస్తారో అందరికీ తెలుసు. తెల్లారిన దగ్గర నుంచి ఒక్కోసారి అర్థరాత్రి వరకూ పనిచేస్తూనే ఉంటారు. ఇక ఎన్నికలొచ్చాయంటే.. అటు ముఖ్యమంత్రిగా అధికారిక విధులతో పాటు.. ఇటు పార్టీ అధినేతగానూ..తీరికలేని పని. ఎన్నికల కదనంతో కదం తొక్కుతున్నా ఆయన వదనంలో ఎక్కడా చిరునవ్వు చెదరడం లేదు. ఉదయం లేవగానే అటు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. ఆ వెంటనే పార్టీ సమాచారం. ఆ తర్వాత.. లక్షలాదిమంది పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం టెలీ కాన్ఫరెన్స్. ఆ వెంటనే బయలు దేరి రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో తేలుతారు. రెండు- ముూడు జిల్లాలను చుట్టేస్తారు. మండే ఎండల్లో రోడ్ షోలు.. సభలు పెడతారు. రాత్రి పదైనా అంతే ఉత్సాహంగా ఉంటారు.