ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ నిర్వహణలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమయ్యిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పనిచేయని ఈవీఎంలతో ఎన్నికలు ఎలా నిర్వహిద్దామనుకున్నారో సమాధానం ఇవ్వాలని ప్రశ్నించారు. ఈసీ తీరు, ఈవీఎంల లోపాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరును నిరసిస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీయనున్నారు.
నేడు దిల్లీలో ఈసీతో భేటీకానున్న చంద్రబాబు ఎన్నికల నిర్వహణ తీరుపై నిరసన తెలపనున్నారు. ఇతర పార్టీల నేతలతో కలిసి ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. అనంతరం భాజపాకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల నిర్వహణలో ఈసీ అలసత్వం, ఈవీఎం మొరాయింపులు, అర్ధరాత్రిల్లో పోలింగ్, భారీ క్యూలైన్లు, వైకాపా నేతల దౌర్జన్యాలతో ఈ ఎన్నికలు హాట్ హాట్‌గా సాగాయి. ఈసీ ఏకపక్ష నిర్ణయాలు, ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వ్యవహారంపై చంద్రబాబు నేడు, రేపు దిల్లీలో ఉద్యమించనున్నారు.
ముఖ్యమంత్రితో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు, సిట్టింగ్ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర మంత్రులు నేడు దిల్లీకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో చంద్రబాబు భేటీకానున్నారు. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల మొరాయింపుపై ఫిర్యాదు చేయనున్నారు. వీవీ ప్యాట్‌ల లెక్కింపుపై సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ వేసేందుకు తెదేపా అధినేత సిద్ధమయ్యారు.