ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఓడిన వైకల్యం.. గెలిచిన మనోబలం - దివ్యాంగుడు

అతని మనోధైర్యం ముందు వైకల్యం ఓడిపోయింది. చిన్నప్పుడే విద్యుదాఘాతంతో తన రెండు చేతులు కోల్పోయిన ప్రకాశం జిల్లా ఇడుపులపాడుకు చెందిన మన్నెం ప్రభాకర్...ఏదైనా సాధించాలనే తపనతో బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. దివ్యాంగుడినని చింతించకుండా ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకొని అందుకు సమాయత్తం అవుతున్నారు. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదంటూ నిరూపిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఓడిన వైకల్యం...... గెలిచిన మనోబలం

By

Published : Jul 1, 2019, 12:20 PM IST

Updated : Jul 1, 2019, 12:42 PM IST

ఓడిన వైకల్యం...... గెలిచిన మనోబలం
ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం ఇడుపులపాడు గ్రామానికి చెందిన మన్నెం సింగయ్య, గంగమ్మ దంపతులకు మూడో సంతానం ప్రభాకర్. ఐదో తరగతి చదువుతున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై ప్రభాకర్ తన రెండు చేతులు కోల్పోయాడు.

నోటితో పెన్ను పట్టుకొని అవలీలగా..
చిన్నప్పటి నుంచి ప్రభాకర్​కు చదువంటే మక్కువ. రెండు చేతులు లేకపోయినా పట్టుదల వీడలేదు. పదో తరగతి వరకు సొంత గ్రామంలో చదివారు. ఇంటర్, డిగ్రీలను గుంటూరు ఏసీ కళాశాలలో పూర్తి చేశారు. అనంతరం బీఈడీ ప్రకాశం జిల్లా తర్లుపాడులో చదివారు. తర్వాత యర్రగొండపాలెంలో తన సోదరుడి ఇంటిలో ఉండేవారు. అక్కడ చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు. ప్రస్తుతం పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం గ్రామంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు.

క్రీడల్లోనూ ప్రావీణ్యం
ప్రభాకర్ పిల్లలకు పాఠాలు చెప్పాలంటే అతనికి ఉన్న సగం చేతికి బెల్టును తోడగాలి. బెల్ట్ సహాయంతో బోర్డుపై రాస్తూ విద్యార్థులకు అక్షరాలు నేర్పిస్తుంటారు. పుస్తకాలు రాయలన్నా.. ఇతర లేఖలు రాయలన్నా నోటితో పెన్ను పట్టుకొని రాస్తుంటారు. కేవలం చదువే కాకుండా.. క్రికెట్, వాలీబాల్ ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తనకు చేతులు లేవనే భావన లేకుండా అన్ని పనులు తానే చేసుకుంటూ ఔరా! అనిపిస్తున్నారు.

ఏనాడూ చేతులు లేవని బాధపడకుండా తనకు ఉన్న ప్రతిభతో ప్రభాకర్​ ముందుకెళ్తున్నారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో ఉన్న ప్రభాకర్​ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి :10 రోజులుగా విద్యుత్ లేదు.. ఎవరూ పట్టించుకోరా?

Last Updated : Jul 1, 2019, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details