ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఆత్మీయంగా సాగిన జగన్​ హైదరాబాద్​ పర్యటన - kcr

కాబోయే ముఖ్యమంత్రి వైఎస్​ జగన్మోహన్​రెడ్డి హైదరాబాద్​ పర్యటన సందడిగా సాగింది. ముందుగా తెలుగు రాష్ట్రాల గవర్నర్​ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. అనంతరం.. తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు.

ys jagan

By

Published : May 26, 2019, 12:05 AM IST

Updated : May 26, 2019, 2:18 AM IST

ఆత్మీయంగా సాగిన జగన్​ హైదరాబాద్​ పర్యటన

ఆంధ్రప్రదేశ్​ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుని... మొదటిసారిగా హైదరాబాద్​లో పర్యటించిన వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి... తెలంగాణ ప్రగతి భవన్​లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జగన్​, ఆయన సతీమణి భారతిని... కారు దగ్గరకు వెళ్లి సీఎం కేసీఆర్​ ఆప్యాయంగా ఆహ్వానించారు. జగన్​కు పుష్పగుచ్చం ఇచ్చి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. 151 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసినందుకు మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. పోచంపల్లి ఇక్కత్ శాలువా కప్పి.. కరీంనగర్ ఫిలిగ్రీ జ్ఞాపిక బహుకరించి సత్కరించారు.

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​, సెక్రటరీ జనరల్ కేశవరావు, మంత్రులు, సభాపతి, ఉపసభాపతి జగన్​ బృందానికి ఘన స్వాగతం పలికారు. ఇరు పార్టీల నేతలను కేసీఆర్- జగన్ పరస్పరం పరిచయం చేసుకున్న తర్వాత దాదాపు గంట సేపు సమావేశం జరిగింది. ఈ నెల 30న జరగనున్న ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా కేసీఆర్​ను జగన్​ కోరగా... అందుకు అంగీకరించారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఇప్పటికే కేసీఆర్​ ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టు సమాచారం.

కలసి మెలసి నడుద్దాం

రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని, కేంద్రంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో కలిసి పనిచేయాలనే దానిపై ప్రాథమికంగా చర్చ జరిగినట్లు తెరాస వర్గాలు తెలిపాయి. గోదావరి నది నుంచి తెలంగాణ గరిష్ఠంగా 700 నుంచి 800 టీఎంసీలు మాత్రమే వాడుకోగలదని... ప్రతీ ఏటా సుమారు 3వేల 500 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజి ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించి.. ఆ నీరంతా ఆంధ్రప్రదేశ్ వాడుకునే వీలుందన్నారు. కేవలం రెండు లిఫ్టులతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చు అని అన్నారు. త్వరలోనే రెండు రాష్ట్రాల అధికారులతో కలిసి సమావేశమై అన్ని అంశాలపై చర్చించుకోవాలని కేసీఆర్, జగన్ నిర్ణయించారు. నీటి వివాదాలు పరిష్కరించుకునేందుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫఢణవీస్​తో తాను జరిపిన చర్చలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

గవర్నర్​తో భేటీ...

అంతకుముందు రాజ్​భవన్​లో జగన్​ గవర్నర్​ నరసింహన్​ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. జగన్ వెంట ఆయన భార్య భారతి, వైకాపా ముఖ్య నేతలు ఉన్నారు. తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నట్లు బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని వైకాపా నేతల బృందం గవర్నర్​కు తీర్మాన ప్రతిని అందించింది. జగన్​ను అభినందించిన గవర్నర్... రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. సుపరిపాలన అందించాలని గవర్నర్​ సూచించారు. వీరి మధ్య దాదాపు గంటకుపైగా సమావేశం జరిగింది. ఈ నెల 30న మధ్యాహ్నం 12గంటల 23 నిమిషాలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్​ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు... రాజ్​భవన్​ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

ఘనస్వాగతం...

గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో జగన్ సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఘనస్వాగతం పలికారు. తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులను ఆయన కారు దిగి చేయి ఊపుతూ పలకరించారు. ఈ సమయంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఇవీ చూడండి: కేసీఆర్​తో జగన్ భేటీ.. ప్రమాణ స్వీకారానికి​ ఆహ్వానం

Last Updated : May 26, 2019, 2:18 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details