కేంద్రం తీరుకు నిరసనగా కోల్‌కతా సీఎం మమతా బెనర్జీ ధర్నాకు దిగారు. దీనిపై తృణముల్ కాంగ్రెస్ అధినేత్రికి దేశవ్యాప్త మద్దతు లభిస్తోంది. కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను విచారించేందుకు సీబీఐ అధికారులు రావడాన్ని మమతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మమతా బెనర్జీకి పూర్తి మద్దతును ప్రకటించారు. ప్రతిపక్షాలన్ని ఏకమై భాజపా నిరంకుశ పాలనను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థలపై మోదీ ప్రభుత్వం, భాజపా క్రూరంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మమతా బెనర్జీకి సంఘీభావం ప్రకటించారు. మోదీ-షా ద్వయం ప్రభుత్వ సంస్థలను నాశనం చేస్తోందని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు భాజపా వాటి వ్యతిరేక పార్టీలపై దాడులు నిర్వహిస్తోందన్నారు. దీని పర్యవసనాలు దేశంలో తీవ్రంగా ఉంటాయన్నారు.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా మమతా మాట్లాడానని ట్వీట్ చేస్తూ... మోదీ-షా ద్వయం ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.
సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ సీబీఐ తీరు ప్రజాస్వామ్య వ్యతిరేకమన్నారు. రాజ్యాంగ విలువలకు విరుద్ధమని విమర్శించారు. భాజపా మంచి చేసో చెడు చేసో తిరిగి అధికారం చేపట్టాలని యోచిస్తోందన్నారు. సీబీఐని రాజకీయ అవసరాల కోసం వాడుకొంటోందని అఖిలేష్ విమర్షించారు.
రాష్ట్రీయ జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ... దేశంలో రాజ్యాంగం, రాజ్యాంగ సంస్థలు అసాధారణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితులు పౌర యుద్ధానికి దారితీసేలా ఉన్నాయన్నారు. ప్రస్తుతం దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ కూడా సీబీఐ ద్వారానే దర్యాప్తు జరిగింది.
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కూడా మమతా బెనర్జీ చేస్తున్న దీక్షకు సంఘీభావం ప్రకటించారు.