ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

మరణమా నీ ముల్లెక్కడ?

క్యాన్సర్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

By

Published : Feb 4, 2019, 3:31 AM IST

చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో అదో చిన్న గ్రామం. కానీ పల్లెల్లో కనిపించే సంబరాలు అక్కడ దూరమై చాలా కాలమైంది. అంతు తెలియని కారణాలతో బిక్కుబిక్కుమంటూ వారంతా బతుకీడుస్తున్నారు. ఊరిలో నెలకో మరణవార్త వారందరినీ కలచివేస్తుంది. ప్రాణాలే పణంగా.....మహమ్మారిలా విజృంభిస్తున్న క్యాన్సర్ కోరల్లో చిక్కుకుని విలవిలాడుతున్న చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం లద్దిగం గ్రామం దైన్యంపై ఈటీవీ-భారత్ ప్రత్యేక కథనం.

కరవుకు నిలయమైన చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో చౌడేపల్లి ఒకటి. మొత్తం గ్రామంలో 340 కుటుంబాలు ఉండగా....1340 మంది జనాభా ఉపాధి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి క్యాన్సర్ అంతులేని విషాదాన్ని నింపింది. గడచిన మూడేళ్లలో గ్రామంలో మరణించిన వారి జాబితా చూస్తే అందులో 90 శాతం మందికి గొంతు క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్ కారణాలే కనిపిస్తూ జరుగుతున్న దారుణాన్ని స్పష్టం చేస్తున్నాయి. అసలు తమకు ఏమైందో తెలియక...బయట వైద్యులు చెబుతోన్న కారణాలు అర్థం కాక గ్రామస్తులంతా దీనంగా బతుకు వెళ్లదీస్తున్నారు.

క్యాన్సర్ మహ్మమారి కబంధ హస్తాల నుంచి తమను కాపాడాలని జిల్లా కలెక్టర్ కు గ్రామస్తులు విన్నవించటంతో ఈ విషయం వెలుగు చూసింది. ఒకే గ్రామంలో ఈ స్థాయిలో క్యాన్సర్ మరణాలను చూసి ఆశ్చర్య పోయిన కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న...ఈ మరణాల వెనక మిస్టరీని చేధించాలని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. జిల్లాలో క్యాన్సర్ నివారణ సదుపాయాలు, ల్యాబ్ సౌకర్యం కలిగిన స్విమ్స్ ఆసుపత్రి సభ్యులు లద్దిగంలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఇప్పటికే మరణించిన వారి కుటుంబాల నుంచి వివరాలను సేకరించారు. క్యాన్సర్ రావటానికి సరైన కారణాలివంటూ ఇప్పటి వరకూ లేకపోవటం, వ్యక్తిగత ఆహార అలవాట్లు, నిరక్ష్యరాస్యత, అవగాహన లేమి, పొగాకు వాడటం, గ్రామంలో పరిశుభ్రత, ఇళ్ల పక్కనే సెల్ ఫోన్ టవర్లు ఇలా ప్రతి అంశంపైనా గ్రామస్తులను క్షుణ్నమైన అభిప్రాయాలను సేకరించారు. గ్రామంలోని మిగిలిన వారికి స్క్రీనింగ్ టెస్ట్ లు నిర్వహించారు. పూర్తి స్థాయిలో గ్రామస్తులందిరికీ స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి అయితే కానీ...ఈ స్థాయిలో క్యాన్సర్ విజృంభణపై నిర్థారణకు రాలేమని లద్దిగంలో పర్యటించిన వైద్యాధికారులు చెబుతున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఈ గ్రామంపై దృష్టి సారించి యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, ఇప్పటికే బాధితులుగా ఉన్న వారిని ఆదుకుంటే తప్ప లద్దిగంలో క్యాన్సర్ ఆగేట్టుగా లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

CANCER PATIENT

ABOUT THE AUTHOR

...view details