సీబీఐ వ్యవహారంపై కోల్‌కతాలో ఆదివారం రాత్రి నుంచి జరుగుతోన్న వరుస పరిణామాలపై గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి సమగ్ర నివేదికను కేంద్ర హోంమంత్రిత్వశాఖకు (రాజ్‌నాథ్ సింగ్)కు సమర్పించారు. బంగాల్ ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీల నివేదికల ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు శాఖ ఈ నివేదికను రూపొందించింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
శారదా కుంభకోణం విషయంలో కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించడానికి వెళ్లిన సీబీఐ అధికారులను నిర్బంధించడంతో వివాదం మొదలైంది. ఈ విషయంపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ప్రతిస్పందించారు. కోల్‌కతా పోలీసులకు అండగా నిలిచారు. అనంతరం సీబీఐ అధికారులను విడుదల చేసినా ఉద్రిక్తత మాత్రం తగ్గలేదు.
మోదీ-షా ద్వయం పశ్చిమ బంగను నాశనం చేయడానికి కుట్రపన్నుతున్నారని మమత తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రం చర్యకు నిరసనగా 'సత్యాగ్రహ' ధర్నా చేపట్టారు. మమత బెనర్జీకి మహాకూటమి నాయకులందరూ సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మమత ధర్నాకు మద్దతు తెలిపారు.