People Fear Mining of Uranium Deposits in Forest Area in Kurnool District :'యురేనియం' పేరు చెబితేనే ఆ గ్రామం వణికిపోతుంది. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల తవ్వకాలు చేస్తారన్న సమాచారంతో గ్రామస్థులకు కంటిమీద కునుకులేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం భయంగా గడుపుతున్నారు. యురేనియం వెలికితీతకు అనుమతులు నిలిపివేయకుంటే 'అణు'ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్థుల పాలిట శాపంగా :ఎంతో ప్రమాదకరమైన అణు ధార్మిక పదార్థం 'యురేనియం' తవ్వకాలను ప్రపంచంలోని అనేక దేశాలు నిలిపివేయగా భారత్‌లో మాత్రం వీటికి అనుమతులు ఇస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడిదే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామస్థుల పాలిట శాపంగా మారింది. కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం నిల్వలను వెలికితీసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు అటామిక్ మినరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ఫ్లోరేషన్ అండ్ రీసెర్చ్ 68 బోర్ల తవ్వకాలకు ప్రతిపాదనలు పంపగా కేంద్రం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం గ్రామస్థుల్లో అలజడి రేపుతోంది.
భయం'కరి' విధ్వంసం - తరచూ ప్రమాద ఘంటికలు - 'కుంకీలను పంపించండి'
బోర్ వెల్స్ వేసేందుకు ప్రతిపాదనలు : ఆదోని రేంజ్ పత్తికొండ సెక్షన్ పరిధిలోని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ పరిధిలో 468.25 హెక్టార్ల అటవీ శాఖకు చెందిన భూములు ఉన్నాయి. కౌలుట్లయ్య మలగా పిలిచే ఈ రిజర్వు ఫారెస్ట్ కప్పట్రాళ్ల, పి.కోటకొండ, మాదాపురం, చెల్లెలచెలిమిల, గుండ్లకొండ గ్రామాల మధ్య విస్తరించింది. ఆ కొండపైనే కౌలుట్లయ్య స్వామి ఆలయం ఉంది. ఈ ప్రదేశంలోనే సర్వే కోసం అనుమతులు వచ్చాయని ప్రచారం జరుగుతోంది.