సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారంలో దారుణం చోటుచేసుకుంది. బెల్టుషాపులో విక్రయించిన మద్యం తాగి లింగాల కనకయ్య అనే ఓ వ్యవసాయ కూలీ కోమాలోకి వెళ్లాడు.
నందారం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ లింగాల కనకయ్య అదే గ్రామంలోని బెల్టుషాపులో శుక్రవారం సాయంత్రం మద్యం కొనుక్కొని తాగాడు. అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురి కావడం వల్ల కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కనకయ్యను పరిశీలించిన వైద్యులు అతడు కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు.
ఫలితంగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శనివారం రాత్రి బెల్టుషాపు నిర్వాహకుని ఇంటి వద్దకు వెళ్లి ప్రశ్నించగా... తనకు ఏం సంబంధం లేదంటూ అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.
గ్రామాల్లో అక్రమంగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నా.. సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారంటూ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బెల్టుషాపు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కనకయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ఇదీ చూడండి:భారత్ లక్ష్యంగా యాపిల్ నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు!