మేడారం పరిసర ప్రాంతాల్లో దేదీప్యమైన వెలుగులు పంచేందుకు.. విద్యుత్ శాఖ సమాయత్తం అవుతోంది. సుమారు 450 మంది సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. జాతర సందర్భంగా విద్యుత్ సరఫరాకు ఎలాంటి అవాంతరం లేకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాసగౌడ్, సత్యవతి రాఠోడ్ మేడారంలో పర్యటించి, పనుల పురోగతిని సమీక్షించనున్నారు.
జాతర తేదీలు దగ్గరపడుతుండడం వల్ల కొన్ని శాఖలకు చెందిన పనులు క్రమంగా కొలిక్కి వస్తున్నాయి. విద్యుత్ శాఖ తరఫున నియంత్రికలు, స్తంభాల ఏర్పాటు, తీగల బిగింపు, విద్యుత్ దీపాల అమరిక తదితర పనులు చేశారు. సరఫరా, లోడ్ స్థితిగతులను తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. కొత్తూరు సబ్స్టేషన్లో రెండు ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్లు, కొత్త మేడారం సబ్స్టేషన్లో రెండు 6 ఎంవీఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్లలను ఏర్పాటుచేశారు.
కమలాపూర్ వద్ద 132/33 కేవీ, కొత్తూరులోని 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ల నుంచి నిరంతర సరఫరా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. రూ.88 లక్షలతో జాతర పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. హైమాస్డ్ లైట్లు, ఎల్‌ఈడీ దీపాలను సిద్ధం చేశారు. 76 కిలోమీటర్ల పొడవునా విద్యుత్ తీగలను బిగించారు. పనుల పురోగతిని ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు పరిశీలించారు.
మేడారానికి రోజురోజుకు రద్దీ పెరుగుతోంది. వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. జంపన్న వాగు వద్ద స్నానాలు చేసి గద్దెల బాట పడుతున్నారు. భక్తులకు అత్యవసర సౌకర్యాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. మరుగుదొడ్లు, నళ్లాలు ఇంకా పూర్తి కాలేదు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గుడారాల నిర్మాణం ఇప్పుడే ఆరంభించారు. ఆఖరి నిమిషం వరకు పనులను సాగదీయకుండా.. త్వరితగతిన పూర్తిచేస్తే మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఉండవు. అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీచూడండి: ఆర్టీసీ కండక్టర్ల విద్యార్హత చూసి విస్తుపోయిన యాజమాన్యం